Fri Jan 10 2025 11:06:59 GMT+0000 (Coordinated Universal Time)
వెక్కి వెక్కి ఏడ్చిన పాకిస్తాన్ క్రికెటర్.. వీడియో వైరల్
గురువారం పెర్త్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌ను జింబాబ్వే 1 పరుగు తేడాతో ఓడించింది. జింబాబ్వేపై పాకిస్తాన్ గొప్ప రికార్డు కలిగి ఉన్నప్పటికీ ఈ ఓటమి వారిని ఎంతగానో బాధించింది. నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ 131 పరుగుల తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. కెప్టెన్ బాబర్ అజామ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు ముందుగానే ఔట్ కావడంతో పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ లక్ష్యాన్ని చేధించడానికి చాలా కష్టపడింది. షాన్ మసూద్ మంచి ఇన్నింగ్స్‌ను ఆడి పాక్ ను గెలిపించడానికి ప్రయత్నించాడు. షాదాబ్ ఖాన్ (17) తో కలిసి 4వ వికెట్ కు కీలకమైన 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, ఇది పాకిస్థాన్‌ను విజయానికి చేరువ చేసింది.
కానీ జింబాబ్వే కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడం.. వికెట్లు తీయడంతో మ్యాచ్ ను ఆఖరి బంతి వరకూ తీసుకుని వెళ్లారు. ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సిన సమయంలో రనౌట్ అవ్వడంతో ఒక్క పరుగు తేడాతో పాక్ మ్యాచ్ ను కోల్పోయింది. అప్పటికే భారత్ తో మ్యాచ్ లో ఓటమి కారణంగా.. ఒత్తిడిలో పాక్ ఆటగాళ్లను ఈ ఓటమి మరింత కుదిపేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లు, అభిమానులందరి ముఖాల్లో నిరాశ ఉంది. వారిలో కొందరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. పెవిలియన్ కు వెళ్లే దారిలో షాదాబ్ ఖాన్ కూర్చుని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అభిమాని తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్తాన్ ఇప్పుడు తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో మూడూ గెలవాల్సి ఉంది.. పాక్ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా భారత్ అన్ని మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే పాక్ సెమీస్ కు చేరుతుంది.
Next Story