Sat Nov 23 2024 03:46:16 GMT+0000 (Coordinated Universal Time)
Snehit Reddy: న్యూజిలాండ్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ లో దుమ్ము రేపుతున్న స్నేహిత్ రెడ్డి
మరో భారత సంతతి క్రికెటర్ కివీస్ జట్టులో దుమ్ము దులుపుతున్నారు
గత ఏడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర భారత గడ్డపై అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. రచిన్ భారత సంతతికి చెందినవాడు, అయితే అతను న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. మొత్తం టోర్నీలో కివీస్ జట్టు తరఫున రచిన్ 565 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఆడాడు. ఇప్పుడు మరో భారత సంతతి క్రికెటర్ కివీస్ జట్టులో దుమ్ము దులుపుతున్నాడు.
అతడు మరెవరో కాదు స్నేహిత్ రెడ్డి దేవిరెడ్డి. విజయవాడలో పుట్టిన స్నేహిత్ రెడ్డి, ICC అండర్-19 ప్రపంచ కప్‌లో తన మొదటి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ చేశాడు. నేపాల్ అండర్-19 జట్టుపై 147 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 125 బంతులు ఆడిన స్నేహిత్ రెడ్డి 11 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా వికెట్ల మధ్య రన్నింగ్ అద్భుతమని పలువురు మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక బౌలింగ్ లో కూడా జట్టుకు అండగా ఉంటూ ఉంటాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ గానూ స్నేహిత్ రెడ్డి రాణిస్తూ ఉన్నాడు.
స్నేహిత్ రెడ్డి విజయవాడలో 2007 సంవత్సరంలో జన్మించాడు. అతను 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుటుంబం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు మారింది. న్యూజిలాండ్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడకముందే.. అండర్-17లో తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. 7 సంవత్సరాల పాటు ఆక్లాండ్‌లో నివసించిన తర్వాత, స్నేహిత్ కుటుంబం 2014లో హామిల్టన్‌కు వెళ్లింది. స్నేహిత్ కుటుంబం హామిల్టన్‌లోని విక్టోరియాలో ఒక కేఫ్‌ను నడపడం ప్రారంభించింది. స్నేహిత్‌కు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. స్నేహిత్ తండ్రి హామిల్టన్‌లోని క్లబ్ స్థాయిలో ఆడాడు. తండ్రిని చూసి స్నేహిత్ కూడా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. స్నేహిత్ చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద మమకారం పెంచుకోడానికి కారణం ఇదే. స్నేహిత్‌కు కేవలం 15 సంవత్సరాల వయస్సులో నార్తర్న్ డిస్ట్రిక్ట్ A తరపున ఆడే అవకాశం లభించింది. అప్పటి నుండి అతను వెనుదిరిగి చూడలేదు. తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ అండర్-17 జట్టులో చోటు సంపాదించాడు. స్నేహిత్ రెడ్డి ఆట చూసి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బిజె వాట్లింగ్ కూడా మెచ్చుకున్నాడు. అతను స్నేహిత్‌కు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. స్నేహిత్ రెడ్డి న్యూజిలాండ్ లెజెండ్ కేన్ విలియమ్సన్‌ను తన రోల్ మోడల్‌గా భావిస్తాడు.
అండర్-19 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ లో సెంచరీ చేశాక.. స్నేహిత్ రెడ్డి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక మ్యాచ్ అనంతరం స్నేహిత్ రెడ్డి మాట్లాడుతూ.. సెంచరీ కొట్టాక సెలబ్రేషన్ ఎలా చేయాలా అనే విషయాన్ని మ్యాచ్ కు ముందు మాట్లాడుకున్నాం. గిల్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకమైనదని స్నేహిత్ రెడ్డి చెప్పాడు. గిల్ నా అభిమాన ఆటగాళ్ళలో ఒకడు.. అతని బ్యాటింగ్ స్టైల్ చాలా ఇష్టం.. అతని టైమింగ్ అసాధారణమైనది, నా బ్యాటింగ్‌లో నేను అతనిని అనుకరించటానికి ప్రయత్నించానని స్నేహిత్ తెలిపాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ స్నేహిత్ భారీ సెంచరీ కారణంగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 302 పరుగులు చేసింది. తర్వాత న్యూజిలాండ్ నేపాల్ ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 238 పరుగులకే పరిమితం చేసింది. కివీస్ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Next Story