Mon Dec 23 2024 07:34:55 GMT+0000 (Coordinated Universal Time)
పాపం ఆఫ్ఘన్.. టాస్ బాల్ ను బౌండరీ కొట్టినా 'సూపర్-4' లోకి వచ్చేవాళ్లు
32 బంతుల్లో 65 పరుగులు చేసిన నబీ ఔట్ కావడంతో శ్రీలంకకు అవకాశం వచ్చింది
మహ్మద్ నబీ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆఫ్ఘనిస్తాన్ దాదాపుగా ఆసియా కప్2023 సూపర్ 4 లో అడుగుపెట్టేసి ఉండేది. అయితే నెట్ రన్ రేట్ గురించి తెలియకపోవడంతో ఆఫ్ఘన్ ఓ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకకు ఊహించని షాక్ ఇచ్చేసేది.. కానీ జస్ట్ మిస్ అయ్యింది. శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఆఫ్ఘన్. 37.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధిస్తే ఆఫ్ఘన్ సూపర్ 4 కు అర్హత సాధించేది. ఆ తర్వాత కూడా ఇంకో రెండు బాల్స్ లో సిక్సర్ కొట్టినా కూడా సూపర్-4 కు చేరేది. కానీ ఈ విషయం జట్టుకు తెలియకపోవడంతో చివరకు 37.4 ఓవర్లకు 289 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-బిలో ఇప్పటికే బంగ్లాదేశ్ సూపర్-4కు అర్హత సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 92 పరుగులతో రాణించాడు. పథుమ్ నిస్సంక 41, అసలంక 36, దునిత్ వెల్లెలెగె 33 నాటౌట్ రాణించారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు తీయగా రషీద్ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. శ్రీలంక నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 37.1 ఓవర్లలో ఛేదిస్తేనే సూపర్-4 అర్హత సాధించేది. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన అప్గనిస్తాన్.. పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రెహ్మత్ షా, షాహిది, నబీ చెలరేగారు. 32 బంతుల్లో 65 పరుగులు చేసిన నబీ ఔట్ కావడంతో శ్రీలంకకు అవకాశం వచ్చింది.
37 ఓవర్లు పూర్తయ్యే సరికి 289 పరుగులు చేసిన ఆఫ్ఘన్.. తదుపరి ఓవర్ మొదటి బంతికి 3 పరుగులు చేస్తే సూపర్4కు అర్హత సాధించేది. ఆఫ్ఘన్ బ్యాటర్ ముజీబ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరి బ్యాట్స్మన్గా ఫారుఖీ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో 3 బంతుల్లో 6 పరుగులు చేసినా సూపర్ 4 కు క్వాలిఫై అయ్యేది. ఈ విషయం క్రీజులో ఉన్న రషీద్ ఖాన్, ఫారుఖీకి చెప్పలేదు. ఫారుఖీ రాగానే.. టాస్ బాల్ వేశారు. అప్పటికే నిరాశతో ఉండడంతో దాన్ని కొట్టాలని కూడా ఫారూఖీ అనుకోలేదు. రెండు బంతులు డిఫెన్స్ ఆడిన ఫారుఖీ మూడో బంతికి ఎల్బీ రూపంలో ఔటయ్యాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు ఆలౌట్ అయ్యింది. సూపర్-4 చేరకుండా నిష్క్రమించింది. పాపం ఈ విషయం తెలిసి ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఓ వన్డే మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
Next Story