Mon Dec 23 2024 02:38:09 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలంక క్రికెట్ జట్టు.. ఐసీసీ ఈవెంట్స్ లో ఆడదా?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీలంక క్రికెట్ బోర్డుకు షాకింగ్ న్యూస్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీలంక క్రికెట్ బోర్డుకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉందని భావించిన ఐసీసీ లంక క్రికెట్ బోర్డును తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఐసీసీ నియమావళిని శ్రీలంక క్రికెట్ బోర్డు ఉల్లంఘించిందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డుల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉండరాదన్న నిబంధనను శ్రీలంక క్రికెట్ అతిక్రమించిందని.. స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడంలో విఫలమైందని ఐసీసీ అభిప్రాయపడింది. అందుకే శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేస్తున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది.
వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. 9 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యలందరిపైనా ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘే వేటు వేశారు. బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ సారథి అర్జున రణతుంగను నియమించారు. ఇది ప్రభుత్వ జోక్యంగా భావించిన ఐసీసీ.. ప్రస్తుతానికి శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది.
Next Story