Wed Apr 23 2025 17:30:37 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : పంజాబ్ కింగ్స్ ను పడుకోబెట్టేసిన హైదరాబాద్ సన్ రైజర్స్
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఓడించింది.

చాలా రోజులకు సన్ రైజర్స్ తన సత్తా చూపింది. ఈ సీజన్ లో చతికిలపడి సాగిలపడి సాగుతూ వస్తున్న హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకు చాన్నాళ్లకు విజయం లభించింది. అందులోనూ తమకు అచ్చి వచ్చిన ఉప్పల్ స్టేడియంలో గెలుపును తిరిగి తమ సొంతం చేసుకుని ఇంకా తాము బరిలోఉన్నామంటూ బలమైన సంకేతాలను పంపగలిగింది. కాటేరమ్మ కొడుకులు తిరిగి ఊపందుకున్నారు. విధ్వంసాన్ని ప్రత్యర్థులకు రుచి చూపించారు. గత సీజన్ లో చూపిన ఆట ఏమయిపోయిందన్న బాధతో ఉన్న అభిమానులకు చాన్నాళ్ల తర్వాత అపూర్వ విజయాన్ని అందించి సన్ రైజర్స్ టీం మళ్లీ సత్తా చాటింది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఓడించింది.
కింగ్స్ బాగా ఆడినా...
ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఎదురులేదన్న పేరుంది. మంచిజట్టుగా పేరుంది. అయితే సన్ రైజర్స్ కు తొలుత బ్యాటింగ్ ఇస్తే విధ్వంసం సృష్టిస్తారనేమో.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత తానే బ్యాటింగ్ ను ఎంచుకుంది. అనుకున్నట్లుగానే పంజాబ్ కింగ్స్ మంచి ప్రతిభనే చూపింది. ఓపెనర్లుగా దిగినా ప్రియాంశ్, పభ్ సిమ్రాన్ లు వీరబాదుడు బాదారు. దాదాపు ఓవర్ కు 16 రన్ రేటు తెచ్చారు. ప్రియాంశ్ 36 పరుగుల వద్ద హర్హిత్ పటేల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రభ్ సిమ్రాన్ 42 పరుగులు చేసి మలింగ చేతికి చిక్కారు. హెడ్ 82 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇక స్టయినిస్ 34 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. పంజాబ్ కింగ్స్ మొత్తం ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేయగలిగింది.
అభిషేక్ శర్మ మామూలుగా...
ఇక ఛేదనలో ఎప్పటిలాగానే ఈ సీజన్ లో తడబడతారని సన్ రైజర్స్ ఫ్యాన్స్ భావించారు. కానీ హెడ్ ఓపెనర్ గా దిగి కుదురుకుని 66 పరుగులు చేశాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అయితే బంతిని గాలిలోనే ఉంచాడు. అభిషేక్ శర్మ 141 పరుగులు చేసి ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు. క్లాసెన్, ఇషాన్ కిషన్ లు మిగిలిన రన్స్ లను పూర్తి చేయగలిగారు. అభిషేక్ శర్మ ఆడుతుంటే స్టేడియం మొత్తం ఊగిపోయింది. చాలా రోజుల తర్వాత విజయానికి చేరువకు రావడంతో సన్ రైజర్స్ అభిమానులు ఇక ఆగలేదు. స్టేడియం దద్దరిల్లిపోయింది. దీంతో 18.3 ఓవర్లలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రెండు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి విజయాన్నిసొంతం చేసుకుంది.
Next Story