Fri Dec 20 2024 08:46:13 GMT+0000 (Coordinated Universal Time)
Virat Kohli : అదే జరిగితే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊగిపోరూ.. ప్రచారమా? నిజమేనా?
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ కప్‌కు విరాట్ కొహ్లిని ఎంపిక చేయకపోవచ్చన్న ప్రచారం ఉంది
ఐపీఎల్ 17వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అదే సమయంలో ఈ సంరంభం ముగిసిన వెంటనే టీ 20 వరల్డ్ కప్ కు ప్రారంభం అవుతుంది. ఈసారి వెస్టండీస్, యుఎస్లలో టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. జూన్ నెలలో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఒక వార్త విరాట్ ఫ్యాన్స్ కు కంటి మీద నిదుర లేకుండా చేస్తుంది. ఈసారి వరల్డ్ కప్ కు విరాట్ కొహ్లీని ఎంపిక చేయకపోవచ్చన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతుంది. కొహ్లి ఎంపిక విషయంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా జరుగుతున్న పరిణామాలు కలవర పెట్టేవిగా కనపడుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో...
టీ 20 వరల్డ్ కప్ ఈసారి బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. దాదాపు పదకొండేళ్ల నుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా భారత్ జట్టు ముద్దాడ లేదు. అందుకే ఈసారి వరల్డ్ కప్ కు స్ట్రాంగ్ టీంను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. 2013 నుంచి ఇప్పటి వరకూ ఐసీసీ ట్రోఫీని గెలవకపోవడంతో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంలో సెలక్షన్ కమిటీ ఉన్నట్లు బయట పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అందులో విరాట్ కొహ్లి పేరు కూడా ఉంది. కొహ్లినీ ఈసారి టీ 20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయరని అంటున్నారు.
ఫామ్ లేక పోవడం...
విరాట్ కొహ్లి కూడా ఈ ఫార్మాట్ లో పెద్దగా ఫామ్ లో లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఐపీఎల్ లో కొహ్లి ఆటతీరును పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి సెలక్షన్ కమిటీ వస్తారని కూడా అంటున్నారు. విరాట్ కొహ్లి ఎంపిక చేయడం లేదన్న ఒక కథనాన్ని టెలిగ్రాఫ్ ప్రచురించడంతో విరాట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కొహ్లి లేని జట్టును చూడలేం. కొహ్లి ఉంటే ఆ తీరు వేరు. ఫాం లోకి వస్తే కొహ్లిని ఆపగల శక్తి ఎవరికీ ఉండదని, మైదానంలో విరాట్ ఉంటే అదొక ధైర్యమని ఫ్యాన్స్ పెద్దయెత్తున సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. విరాట్ కొహ్లి లేని జట్టును చూడలేమంటూ మరికొందరు వాపోతున్నారు.
యువ ఆటగాళ్లనే...
టీ 20 వరల్డ్ కప్ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. కానీ కొహ్లి విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. కొహ్లి ఎంపిక విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు బీసీసీఐ అప్పగించిందని పెద్దలు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీ 20లలో విరాట్ కొహ్లి ఆడలేదు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. దీంతో పాటు వెస్టిండీస్ లో మైదానాలపై కొహ్లి ఆడలేడన్న వాదన కూడా ఈ వాదనకు మరింత బలాన్నిస్తుంది. దీంతో యువ ఆటగాళ్లకు మాత్రమే రానున్న టీ 20 వరల్డ్ కప్ లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో బీసీసీఐ ఉన్నట్లు పెద్దయెత్తున జరుగుతున్న ప్రచారం ఇప్పుడు కొహ్లి ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది. మరి ఏం జరుగుతుందన్నది రానున్న కాలంలో చూడాల్సి ఉంది.
Next Story