Sun Apr 27 2025 11:27:01 GMT+0000 (Coordinated Universal Time)
India vs Bangladesh Champions Trophy : ఇంకా కుదుట పడినట్లు లేదుగా.. ఇన్ని తడబ్యాట్లా?
దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీంఇండియా విజయం సాధించింది

దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీంఇండియా విజయం సాధించింది. అయితే నిన్న భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ చూసిన వారికి ఒక నిజం అర్థమయింది. ఇంకా మనోళ్లు కుదుట పడలేదు. నిలదొక్కుకునేందుకు ప్రయత్నించడం లేదు. అనవసర షాట్స్ కు వెళ్లి అవుటయి తర్వాత వచ్చే వారి పై వత్తిడి పెంచడాన్ని ఇంకా మానుకోలేదు. రోహిత్ శర్మ కుదురుకున్నారని భావించేలోగానే క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు. విరాట్ కోహ్లి 22 పరుగులు చేసి ఎప్పటిలాగే బాల్ చేతికిచ్చి వెళ్లిపోయాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అనవసర షాట్ ఆడి మరింత ఒత్తిడి పెంచాడు. ఇలా అందరూ తమ తర్వాత వారిపై ప్రెషర్ పెంచారే తప్పించి తక్కువ స్కోరును తాము చేద్దామన్న తపన మాత్రం కొంచెం కూడా కనిపించలేదు.
తక్కువ స్కోరుకే అవుట్ కావాల్సి ఉన్నా...
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. షమి, హర్షిత్ రాణాలు తలో వికెట్ తీశారు. ఇక అక్షర్ పటేల్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి మరింత వత్తిడి పెంచాడు. ఇరవై ఐదు పరుగులకు అప్పటికే ఐదు వికెట్లు పడిపోయాయి. అయితే అక్షర్ పటేల్ హ్యాట్రిక్ బంతి క్యాచ్ రాగా రోహిత్ శర్మ వదిలేశాడు. ఇక అంతే జిడ్డు పట్టుకున్నట్లు ఆ ఇద్దరు క్రీజును అంటిపెట్టుకుని ఉండిపోయారు. 150 పరుగులు కూడా చేయలేదని అంచనాలు వినిపించిన బంగ్లాదేశ్ 228 పరుగులు చేసిందంటే అది రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వల్లనే. ఇద్దరు సీనియర్లు చేతికి వచ్చిన క్యాచ్ లను జార విడవడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెలరేగిపోయారు.
గిల్, కేఎల్ రాహుల్ పుణ్యమే...
హృదోయ్ సెంచరీ నమోదు చేశాడు. జేకర్ అరవై ఎనిమిది పరుగులు చేయగలిగాడంటే అది మన సీనియర్ల పుణ్యమే. ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదిలో బాగానే ఆడినట్లు కనిపించింది. రోహిత్ శర్మ 41 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి 22 పరుగులకే అవుటడయ్యాడు. శ్రేయస్ అయ్యర్ పదిహేను పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే శుభమన్ గిల్ ఓపెనర్ గా వచ్చి నిలదొక్కుకుని సెంచరీ చేయడమే కాకుండా, తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 41 పరుగులు చేయడంతో భారత్ విజయం సాధ్యమయింది. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించినా బంగ్లాదేశ్ పై ఇలా చెత్త ఫీల్డింగ్ చేసిన భారత్ సీనియర్ ఆటగాళ్ల తీరు మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. షమి ఐదు వికెట్లు తీసి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు.
Next Story