Fri Nov 22 2024 23:05:13 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Australia T20 : బాదుడు అంటే ఇదే కదా... అవేం ఫోర్లు.. అవేం సిక్స్లు
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ 20ని టీం ఇండియా విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో కంగారూలపై గెలుపొందింది
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ 20ని కూడా టీం ఇండియా విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో కంగారూలపై గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కంగారూలపై విక్టరీ కొట్టేసింది. మొత్తం ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లలో భారత్ 2 - 0 ఆధిక్యంలో కొనసాగుతున్నట్లయింది. వరుణు కరుణించాడు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానం అభిమానుల స్లోగన్స్ తో మార్మోగిపోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ దిగిన వెంటనే బాదుడు మొదలయింది.
ఓపెనర్లుగా క్రీజులోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ లు ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ వీలున్నప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తుండగా, మరో ఎండ్ లో యశస్వి జైశ్వాల్ మాత్రం సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించాడు. యశస్వి జైశ్వాల్ దూకుడుకు పరుగులు అలా పరుగులు పెట్టాయి. స్కోరు బోర్డుపై పరుగులు చూస్తుంటేనే భారత్ భారీ పరుగులు చేస్తుందని పించింది. అలా ఓపెనర్లు ఇద్దరూ భారత్ కు శుభారంభాన్ని ఇచ్చి ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ ను విధించగలిగారు.
ముగ్గురు హాఫ్ సెంచరీలు...
ఈ మ్యాచ్లో ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లు వరసగా అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. షాట్లు కొట్టి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతున్నప్పటికీ తర్వాత వచ్చే బ్యాటర్ కూడా సిక్సర్లు బాదుతుండటంతో ఆసీస్ బౌలర్లు మొహాలు వెలవెల బోయాయి. భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 235 పరుగులు చేసిందంటే పరుగుల వరద ఎలా పారిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అలా మనోళ్లు ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
వెన్ను విరిచి...
చివర్లో వచ్చిన రింకూ సింగ్ కూడా 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ను రవి బిష్ణోయ్ చావు దెబ్బ తీశాడు. మూడు వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచాడు. తర్వాత ప్రసిద్ద్ కృష్ణ కూడా మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా కథను ముగించేలా చేశాడు. ఒకదశలో స్టోయినిస్, డేవిడ్ ల భాగస్వామ్యం నిలదొక్కుకుని కొంత కలవరపెట్టినా వారిని విడదీయడంలో మనోళ్లు సక్సెస్ అయ్యారు. ఫలితంగా భారత్ రెండో విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. తర్వాత మ్యాచ్ ఈ నెల 28న గౌహతిలో జరగనుంది.
Next Story