డ్రగ్స్ తీసుకుంటూ భార్యకు పట్టుబడ్డ క్రికెటర్.. ఎన్నో సంచలన విషయాలు
పాకిస్తాన్ పేస్ గ్రేట్ మరియు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయ్యాక కొకైన్ కు బానిస అయ్యానని వెల్లడించాడు. 2009లో తన మొదటి భార్య మరణంతో కొకైన్ వాడకాన్ని విడిచిపెట్టాడు. 56 ఏళ్ల వసీం అక్రమ్ తన ఆత్మకథ 'సుల్తాన్: ఎ మెమోయిర్' లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు. తన మొదటి భార్య హుమాకు దూరమవుతున్న సమయంలో తాను చాలా చవిచూశానని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. "దక్షిణాసియా దేశాల సంస్కృతిని పరిశీలిస్తే... ఒక్కసారి గొప్ప పేరు వచ్చిందంటే అది మిమ్మల్ని తినేస్తుంది, మైకంలో ముంచేస్తుంది, మిమ్మల్ని అవినీతిపరులుగానూ మార్చేస్తుంది. ఇక్కడ ఒక్క రాత్రిలో 10 పార్టీల్లో పాల్గొనేవాళ్లు ఉంటారు కూడా. ఈ సంస్కృతి నాపైనా తీవ్ర ప్రభావం చూపింది. కానీ నా భార్య హుమా అనారోగ్యంతో బాధపడుతూ చివరిక్షణాల్లో పడిన వేదన చూశాక నేను మళ్లీ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. తాను స్పృహలో లేకపోయినప్పటికీ నాలో మార్పు తీసుకువచ్చింది. ఆ తర్వాత నేనెప్పుడూ పతనం కాలేదు" అని అక్రమ్ తెలిపాడు. డ్రగ్స్ అంశాన్ని తన మొదటి భార్య హుమాకు తెలియకుండా ఉంచాలని భావించానని వెల్లడించాడు. ఇంగ్లండ్ లో ఓ పార్టీలో పాల్గొన్న సందర్భంగా మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నానని, అక్కడ్నించి డ్రగ్స్ లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నానని వెల్లడించాడు. కొకైన్ తీసుకుంటేనే తాను పనిచేయగలనని భావించేవాడ్నని అక్రమ్ తెలిపాడు. ఆ సమయంలో హుమా ఒంటరిగా ఉండేదని తనకు తెలుసని వెల్లడించాడు. కామెంటరీ కోసం వెళుతున్నానని చెప్పి, పార్టీల్లో పాల్గొనేవాడ్నని, చాలా రోజుల పాటు ఇలాగే నటించానని వివరించాడు.