Mon Dec 23 2024 06:20:22 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 Auction : వీళ్ల కోసం కోట్లు కుమ్మరించడానికి రెడీ.. వారు దొరికితే చాలు అంతేనట
ఐపీఎల్ 2024లో ఆటగాళ్ల వేలానికి సమయం దగ్గర పడింది. ఈ నెల 19వ తేదీన దుబాయ్ వేదికగా వేలం ప్రక్రియ మొదలు కానుంది.
ఐపీఎల్ 2024లో ఆటగాళ్ల వేలానికి సమయం దగ్గర పడింది. ఈ నెల 19వ తేదీన దుబాయ్ వేదికగా వేలం ప్రక్రియ మొదలు కానుంది. ఐపీఎల్ అంటేనే కాసుల పంట. కేవలం ఫ్రాంచైజెస్ కు మాత్రమే కాదు.. ప్రసార హక్కులు పొందే ఛానల్స్ కు, ఆటగాళ్లకు మాత్రం కోట్లు తెచ్చి పెడతాయి. ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునే వీలున్న ఏకైక గేమ్ ఐపీఎల్ మాత్రమే. అందుకే వేలం వెర్రిగా పెద్దయెత్తున డబ్బులు కుమ్మరించి ఆటగాళ్లను తమ సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీస్ ప్రయత్నాలు చేస్తాయి. కప్పు గెలవడమే కాదు.. సెమీ ఫైనల్స్... ఫైనల్స్ లో అడుగు పెట్టడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తారు.
విపరీతమైన డిమాండ్...
ముఖ్యంగా కొందరు ఆటగాళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లోనూ.. వివిధ దేశాలతో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లలోనూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను వదులుకునేందుకు.. కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా వెనుకాడదు. అయితే ఈసారి ఐపీఎల్ 2024 కు ఎవరు ఎక్కువ ధర పలుకుతారన్న చర్చ సహజంగానే జరుగుతుంది. వారున్న ఫామ్ ను బట్టి మొత్తాన్ని పెంచుతూ పోవడానికి ఫ్రాంచైజీలు ఎంతవరకూ అయినా ప్రయత్నిస్తాయి. అందులో కొందరిని మాత్రం అస్సలు వదులు కోవు. ఎందుకంటే ఆ ఆటగాడు ఉంటే.. స్కోరు పెంచడానికి... వికెట్లు పడగొట్టడానికి ఉపయోగపడతాడని ముందుగా అంచనా వేసుకుని మరీ ధరలు పలుకుతాయి.
అత్యధిక ధర పలికేది...
అటువంటి వారిలో భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను ఎంత పోసైనా కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. రచిన్ రవీంద్ర ఆల్ రౌండర్ గా పేరుంది. ఇటు బ్యాటర్ గా, అటు బౌలర్ గానూ సత్తా చాటుతున్నాడు. రచిన్ రవీంద్ర ఈ ఐపీఎల్ లో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవచ్చన్న అంచనాలు వినపడుతున్నాయి. మరో బ్యాటర్ హెడ్.. ఆస్ట్రేలియాకు చెందిన ఇతగాడు వన్డే ప్రపంచకప్ లో రాణించాడు. అందుకోసమే ఇతని కోసం కోట్లు కుమ్మరించడానికి ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. వీరితో పాటు న్యూజిలాండ్ కు చెందిన మిచెల్, ఆస్ట్రేలియా కు చెందిన కమిన్స్, స్టార్క్, శ్రీలంకకు చెందిన హసరంగా, రెలాల్డ్ కోయిట్టీ, శార్దూల్ ఠాకూర్, షారూఖ్ ఖాన్ లకు కూడా భారీ ధర పలికే అవకాశముందన్న అంచనాలున్నాయి. ఇదే విషయాన్ని సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా తన అంచనాగా చెప్పడం విశేషం.
Next Story