Thu Dec 26 2024 09:33:55 GMT+0000 (Coordinated Universal Time)
Nithish Kumar Reddy : నితీష్ కు పిలుపు... అదృష్టం అంటే నీదే కదా సామీ?
విశాఖ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డికి జింబాబ్వే పర్యటనలో టీంఇండియాలో చోటు దక్కింది
టీ 20 వరల్డ్ కప్ లో మనోళ్లు వరస విజయంతో దూసుకుపోతున్నారు. సెమీ ఫైనల్స్ కు వరస గెలుపులతో చేరిపోయారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ కు మరో తీపి కబరు కూడా అందింది. అదే విశాఖ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డికి జింబాబ్వే పర్యటనలో టీంఇండియాలో చోటు దక్కింది. అయితే ఒక్కరోజులో నితీష్ కుమార్ కు ఈ లక్ రాలేదు. కసి, పట్టుదలతో సాధించిన కృషితోనే నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి అంతర్జాతీయ ఆటలో మెరవబోతున్నాడు. ఐపీఎల్ లో ఒక ఊపు ఊపిన నితీష్ కుమార్ రెడ్డి ఇంత త్వరగా టీం ఇండియాలో చోటు దక్కించుకుంటానని ఊహించి ఉండరు. కానీ అదృష్టం తలుపు తట్టింది. జింబాబ్వే పర్యటనకు నితీష్ ను బీసీసీఐ ఎంపిక చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ...
నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు. మ్యాచ్ లలో ఇరగదీశాడు. అప్పుడే ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి అని అందరి నోళ్లలోనూ నానాడు. సెలెక్టర్లు మాత్రమే కాదు.. క్రీడా పండితులు కూడా ఆశ్చర్యపోయేలా షాట్లు కొట్టడం చూస్తుంటే మనోడికి మంచి భవిష్యత్ ఉందని ఆరోజే అనిపించింది. కానీ టీం ఇండియా జట్లులో చేరడానికి ఇంత త్వరగా పిలుపు వస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడి మెరుపులు మెరిపించిన నితీష్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపిక కావడం నిజంగా అతడు పడిన కష్టమే ఆ అవకాశాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు
విశాఖకు చెందిన...
విశాఖకు చెందిన నితీష్ రెడ్డి 2003 లో జన్మించాడు. అతని తండ్రి ముత్యాలరెడ్డి హిందూస్థాన్ జింక్ లో పనిచేసి పదవీ విరమణ చేశాడు. 14 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన నితీష్ రెడ్డి తర్వాత అండర్ 16లోకి అడుగుపెట్టాడు. ఆంధ్ర జట్టు తరుపున ఫస్ట్క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన నితీష్ రెడ్డిని హైదరాబాద్ సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ నితీష్ కుమార్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలకే కొనుగోలు చేసింది. కానీ అనేక సార్లు సన్ రైజర్స్ గెలుపునకు నితీష్ కుమార్ కారణమయ్యాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్ కు చేరి కప్పు చేజారిపోయినా నితీష్ కుమార్ రెడ్డి మాత్రం అందరి కంట్లోపడ్డాడు.
జింబాబ్వే పర్యటనలో...
జింబాబ్వే పర్యటనలో టీం ఇండియా మొత్తం ఐదు టీ 20 మ్యాచ్ లు ఆడుతుంది. ఈ ఐదు మ్యాచ్ లు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలోనే జరుగుతాయి. జులై ఏడో తేదీ నుంచి జింబాబ్వే తో టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. జులై 14వ తేదీతో ముగియనున్నాయి. టీం ఇండియాకు శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. యువఆటగాళ్లకు జింబాబ్వే పర్యటనలో బీసీసీఐ అవకాశం కల్పించింది. నితీష్ కుమార్ రెడ్డి తో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కూడా అవకాశం దక్కించుకున్నారు. వీళ్లంతా ఐపీఎల్ లో సత్తా చాటి తమ ఆటను పదిమందికి చూపించగలిగారు. నితీష్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనలోనూ రాణించగలిగితే టీం ఇండియాలో నిలదొక్కుకోవడం సులువుగా మారుతుంది. స్థానం సుస్థిరం చేసుకునే అరుదైన అవకాశం నితీష్ కు లభించింది. అందుకే నితీష్ కుమార్ రెడ్డికి మనమందరం ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే.
Next Story