Mon Dec 23 2024 01:45:01 GMT+0000 (Coordinated Universal Time)
కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే అంతేనా..!
కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే అంతేనా..! ఓటమి మూటగట్టుకున్న టీమిండియా
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు తొలి ఓటమిని ఎదుర్కొంది. బార్బడోస్ లో జరిగిన రెండో వన్డేలో భారతజట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇండియాపై విండీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియన్ బ్యాట్స్ మెన్లలో కేవలం ఇషాన్ కిషన్ (55 పరుగులు), శుభ్ మన్ గిల్ (34) మాత్రమే రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాట్స్ మెన్లలో షై హోప్ (63), కార్టీ (48), కైల్ మేయర్స్ (36) రాణించారు. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55), శుభ్ మాన్ గిల్ (34) తొలి వికెట్ కు 90 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిగతా బ్యాట్స్ మెన్ ఏ మాత్రం రాణించలేకపోయారు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ 24 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 16, రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. సంజు శాంసన్ (9), అక్షర్ పటేల్ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (7) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో గుడాకేశ్ మోతీ 3, రొమారియో షెపర్డ్ 3, అల్జారీ జోసెఫ్ 2, జేడెన్ సీల్స్ 1, యానిక్ కరియా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా భారత జట్టు బరిలోకి దిగింది. సిరీస్ ను నిర్ణయించే తుది వన్డే ఆగస్టు 1న జరగనుంది.
Next Story