Mon Dec 23 2024 10:54:40 GMT+0000 (Coordinated Universal Time)
Sarfaraz Khan : ఇది కదా.. టైం అంటే.. ఖాన్ భయ్యా.. క్యాప్ పెట్టుకుంటే కన్నీళ్లు ఆగలేదు.. కలనెరవేరిన వేళ
తొలి మ్యాచ్ కు క్యాప్ అందుకోగానే కంటి నుంచి నీరు సర్ఫరాజ్ ఖాన్ ను జలజలా రాలాయి. కొన్నేళ్ల స్వప్నం నెరవేరినట్లయింది.
సర్ఫరాజ్ ఖాన్... అంతర్జాతీయ మ్యాచ్లో తొలి అరంగేట్రం.. క్యాప్ కుంబ్లే ఇచ్చిన వేళ స్టేడియంలో ఉన్న తల్లీ తండ్రీ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్ల తమ కలఫలించిందని కన్నీటి పర్యంతమయ్యారు. తొలిసారి టీం ఇండియా క్యాప్ ను సాధించి తన తండ్రిని సర్ఫరాజ్ ఖాన్ ఆలింగనం చేసుకున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఎంత కష్టం... సక్సెస్ అవుతానో... లేదో.... తెలియదు.. భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయలేం... కానీ కసితో ముందుకు సాగాల్సిన పరిస్థితి. కష్టనష్టాలకోర్చి బ్యాట్ ను చేతబట్టి మైదానంలోకి దిగిన తనకు టీం ఇండియాలో చోటు దక్కుతుందో? లేదో? కూడా తెలియదు.
తొలి మ్యాచ్ లోనే...
అలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్ కు క్యాప్ అందుకోగానే కంటి నుంచి నీరు సర్ఫరాజ్ ఖాన్ ను జలజలా రాలాయి. కొన్నేళ్ల స్వప్నం నెరవేరినట్లయింది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ కోచ్ కూడా కావడంతో మైదానంలోనే కాదు... ఇంటి వద్ద కూడా క్రికెట్ పాఠాలే. తన కొడుకు అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడాలన్న కల. ఆ కల నెరవేరుతుందో లేదో తెలియదు. కానీ పట్టుదల.. కసి.. కొడుకును టీం ఇండియా క్యాప్ తో చూడాలన్న తపన. ఇవన్నీ వెరసి రాజ్కోట్ మైదానంలో క్యాప్ అందుకుంటున్న తన కొడుకు సర్ఫరాజ్ ఖాన్ను చూసి నౌషద్ ఖాన్ ఛాతీ ఉప్పొంగిపోయింది. ఎంతలా అంటే... ఎవరెస్ట్ శిఖిరాన్ని అధిరోహించినట్లుగానే.
తండ్రి కోచ్ గా...
సర్ఫరాజ్ ఖాన్ ఒక సాదా సీదా కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగాడు. సమయం అనేది తెలియకుండా కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. తండ్రి చెప్పిన మెలుకువలను నిద్రలో కూడా పాటించే సర్ఫరాజ్ ఖాన్ తాను అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడాలన్న కోరిక తీరలేదు. అసలు తీరుతుందా? తండ్రి ఆశయాన్ని నెరవేర్చగలనా? అన్న అనుమానం ఒకవైపు.. లేదు... లేదు...ఎప్పటికైనా తనకు పిలుపు వస్తుందని ఆశ మరొక వైపు మైదానంలో కత్తిని తిప్పినట్లు బ్యాట్ ను తిప్పేలా చేశాయి. దేశవాళీ క్రికెట్ లో మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ కు బీసీసీఐ నుంచి పిలుపు రాగానే ఉద్వేగానికి గురయ్యాడు. ఇన్నేళ్లకు తన తండ్రితో పాటు తన కలను నెరవేర్చుకున్నాడు.
అంది వచ్చిన అవకాశాన్ని...
అలాగని వచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ ఖాన్ మాత్రం జారవిడుచుకోలేదు. తొలి మ్యాచ్ లోనే సత్తా చూపాడు. 48 బంతుల్లోనే టెస్ట్ మ్యాచ్ లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అరంగ్రేటంలోనే అదరగొట్టేశాడు ఖాన్ దాదా. 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టును చీల్చి చెండాడేశాడు. అందులో 9 ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సర్ఫరాజ్ ఖాన్ పేరు మోత మోగుతుంది. ఇది కదా? ఆటఅంటే అనే తరహాలో తీసుకెళ్లాడు ఈ చిన్నోడు. భవిష్యత్ లో కూడా సర్ఫరాజ్ ఖాన్ మరింత రాణించాలని ఆశిద్దాం. మరిన్ని మెట్లు ఎదిగి టీం ఇండియా కు తురుపు ముక్కలా మారాలని కోరుకుందాం.
Next Story