Mon Dec 23 2024 03:06:43 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు పక్కన హోటల్.. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్
బెలగావిలో రోడ్డు పక్కన టీ స్టాల్ యజమాని 'వైజు నిట్టూర్కర్' ను ఓ వ్యక్తి పలకరించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇంతకూ అతడిని కలిసింది ఎవరో తెలుసా..? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఒక కప్పు టీ కోసం వైజు నిట్టూర్కర్ స్టాల్కి వచ్చాడు. 'గాడ్ ఆఫ్ క్రికెట్' ముంబై నుండి గోవాకు ప్రయాణిస్తూ, మాచే వద్ద బెలగావి శివార్లలో ఉన్న నిట్టూర్కర్ క్యాంటీన్ వద్ద ఒక కప్పు టీ తాగడానికి కొద్దిసేపు ఆగాడు. టెండూల్కర్ తన భార్య, కుటుంబంతో కలిసి ఒక కారులో, నలుగురు అంగరక్షకులు మరో కారులో ఉన్నారు. టెండూల్కర్ క్యాంటీన్లోకి ప్రవేశించినప్పుడు, యజమాని తన కళ్ళను నమ్మలేకపోయాడు.
వైజు నిట్టూర్కర్ మీడియాతో మాట్లాడుతూ, రెండు కార్లు తన క్యాంటీన్ ముందు ఆగిపోయాయని.. అంగరక్షకులు తన వద్దకు వచ్చారని నిట్టూర్కర్ గుర్తు చేసుకున్నారు. వారు క్యాంటీన్ నుండి టీ కప్పులు తీసుకుని, కారులోనే ఉన్న టెండూల్కర్, అతని కుటుంబ సభ్యులకు అందించారు. "ఆ కారులో టెండూల్కర్ అతని కుటుంబం ఉన్నారని అప్పటి వరకు నాకు తెలియదు. టెండూల్కర్ స్వయంగా కారు దిగి, టీ రుచిని మెచ్చుకోవడానికి నన్ను కలిశారు"అని అతను చెప్పాడు. బిల్లు రూ.175 కాగా రూ.200 నోటును నిట్టూర్కర్కు చెల్లించాడు. 25 రూపాయలు తిరిగి ఇస్తుండగా, అదే 200 రూపాయల నోటుపై టెండూల్కర్ ఆటోగ్రాఫ్ అడిగాడు నిట్టూర్కర్. టెండూల్కర్ నవ్వుతూ తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అనంతరం నిట్టూర్కర్ సెల్ఫీ కోసం క్రికెటర్ను అభ్యర్థించాడు. టెండూల్కర్ వెంటనే అంగీకరించాడు. అతనితో కొద్దిసేపు మాట్లాడాడు.
Next Story