Fri Dec 20 2024 22:38:05 GMT+0000 (Coordinated Universal Time)
Indian Young Cricketers : మూతి మీద మీసం మొలవకుండానే మోత పుట్టిస్తున్నారు.. సీనియర్లకు ఇక దడే
టీం ఇండియాలో యువక్రికెటర్లు సీనియర్లకు భయం పుట్టిస్తున్నారు. వాళ్ల స్థానాలకు ఎసరు పెట్టేస్తున్నారు.
Indian Young Cricketers :క్రికెట్ జట్టులో యువరక్తం ఉరకలేస్తుంది. అవును.. ఇప్పుడు ఇదే దేశమంతటా చర్చ. యువ క్రికెటర్లు అనుభవం లేకపోయినా.. అప్పుడే అంతర్జాతీయ మ్యాచ్ లో అడుగుపెట్టినా ప్రత్యర్థి ఎవరన్నది చూడటం లేదు. బంతిని బాదటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త కుర్రాళ్లతో టీం ఇండియా జట్టు మెరిసిపోతుందనే చెప్పాలి. ఎప్పటికైనా కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్లినట్లుగానే.. ఫాం కోల్పోయిన సీనియర్ ఆటగాళ్లు వారంతట వారే తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు కొత్తగా టీంలో చేరిన కుర్రాళ్లే కారణం. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు యంగ్ క్రికెటర్లు. మూతి మీద మీసం మొలవకుండానే మోత మోగించేస్తున్నారు. టీం ఇండియాలో యువక్రికెటర్లు సీనియర్లకు భయం పుట్టిస్తున్నారు. వాళ్ల స్థానాలకు ఎసరు పెట్టేస్తున్నారు.
బంతాట అంటే...
సీనియర్ ఆటగాళ్లు ఉంటే బాగుండేది అన్న ఆలోచన ఇటు సెలెక్టర్లకు గాని, ఫ్యాన్స్ కు కలగనీయకుండా వీర బాదుడు బాదేస్తున్నారు. వాళ్ల ఎయిమ్ గెలవడం కాదు. బంతిని బౌండరీకి తరలించడం. అలాగే సిక్సర్ ను కొట్టేయడం.. ఇక అర్థ సెంచరీలు.. సెంచరీలు.. డబుల్ సెంచరీలు.. ఇలా ఇప్పటి వరకూ భారత్ సీనియర్ ఆటగాళ్ల రికార్డును చెరిపేసే దిశగానే ఆడుతున్నారు. వాళ్లు రికార్డుల కోసం ఆడటం లేదు. తమకున్న ప్రతిభను నిరూపించుకోవడాని, సత్తా చూపుతున్నారు. ఒక్క ఛాన్స్ మిస్ అయినా... మన క్రికెట్ లైఫ్ ఇక ఉండదని భావించి ఆచితూచి ఆడుతూనే ఆటలో మజాను తెచ్చి పెడుతున్నారు.
సీనియర్లపై డేంజర్ సిక్సర్...
యశస్వి జైశ్వాల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. పానీపూరీలు విక్రయించి.. క్రికెట్ పై పిచ్చ అభిమానంతో బ్యాటు చేత పట్టి ఇప్పుడు ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఓపెనర్ స్థానాన్ని దక్కించుకోవడం ఆషామాషీ కాదు. రాజస్థాన్ రాయల్స్ నుంచి యశస్వి బ్యాట్ పట్టి.. ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. టీ 20లలో చోటు దక్కించుకున్నాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. వన్డేల్లోనూ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. ఇక టెస్ట్ మ్యాచ్ లోనూ అంతే.. తాను ఎందులోనూ తగ్గేది లేదని నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్ లోనూ డబుల్ సెంచరీ బాది ప్రత్యర్థులకు మాత్రమే కాదు.. భారత్ సీనియర్ ఆటగాళ్లపై డేంజర్ సిక్సర్ కొట్టేశాడు.
బాదామా? లేదా?
ఇక మరో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. రాజ్కోట్ లోనే క్రీజులోకి అడుగుపెట్టిన మనోడు అసలు బంతిని లెక్క చేయడం లేదు. బంతి ఎవరేశారని కాదు భయ్యా.. బాదామా? లేదా? అన్నదే అన్నట్లు ఆడేస్తున్నట్లు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో అరవైకి పైగా పరుగులు చేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్ లోనూ నాటౌట్ గా నిలిచి 68 పరుగులు చేశాడు. ఇంతకంటే టీం ఇండియాకు ఏం కావాలి? భారత్ లో క్రికెట్ ను అభిమానించే వారికి వీరికి మించిన వారు ఇంకెవరు కావాలి? అన్న తరహాలో బాదుతూ.. బ్యాట్ ను ఊపేస్తూ మైదానంలో పూనకాలు లోడింగ్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆల్ ది బెస్ట్.. బ్రో.
Next Story