Fri Nov 22 2024 17:42:37 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరామనవమి విశిష్టత.. ఈ రోజున సీతారాముల కల్యాణం ఎందుకు చేస్తారు ?
త్రేతాయుగంలో దశరథ మహారాజు - కౌసల్య లకు శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రపు..
చైత్ర శుద్ధ నవమి రోజున హిందువులంతా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజుకు మూడు ప్రత్యేకమైన విశిష్టతలు ఉన్నాయి. మొదటిది రాముడి పుట్టినరోజు. త్రేతాయుగంలో దశరథ మహారాజు - కౌసల్య లకు శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు {క్రీ.పూ} శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఆజానుబాహుడైన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు.. ఈ విశిష్టమైన రోజునే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైనట్లు ప్రజల విశ్వాసం.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు బెల్లం, మిరియాలతో తయారు చేసిన పానకాన్ని అందిస్తారు. అలాగే రామాయణాన్ని పారాయణ చేస్తారు. రాములవారి కల్యాణంతో దేశం సిరి, సంపదలతో తులతూగుతుందని భక్తుల విశ్వాసం. రఘు వంశానికి చెందిన దిలీపుడు, రఘు అనే రాజుల అడుగు జాడల్లోనే రాముడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడని, అందుకే దేశం రామరాజ్యంలా ఉండాలని భావిస్తారు.
Next Story