Thu Dec 19 2024 10:16:54 GMT+0000 (Coordinated Universal Time)
Malla Reddy : మంత్రి మల్లారెడ్డితో మల్లయుద్ధంలో ప్రత్యర్థి బయోడేటా చూస్తే?
మేడ్చల్ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు సాగుతుంది. మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య ఆసక్తికర పోరు జరుగుతుంది
టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డికి, మంత్రి మల్లారెడ్డికి అసలు పొసగదు. 2014లో ఇద్దరూ టీడీపీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు కారణంగా ఇద్దరూ వేర్వేరు పార్టీలలో చేరిపోయారు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరి పీసీసీ చీఫ్ కాగా, మల్లారెడ్డి టీడీపీ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ లో చేరి తర్వాత మేడ్చల్ నుంచి గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. మల్లారెడ్డి పక్కా మాస్. పాలు వ్యాపారం చేసుకునే స్థాయి నుంచి వందల కోట్ల అధిపతిగా ఎదిగారు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలతో పాటు యూనివర్సిటీలు, ఆసుపత్రులు ఆయన సొంతం. మల్లారెడ్డిని ఎన్నికల్లో తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత.
ముఖ్య అనుచరుడు...
మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు వజ్రేష్ యాదవ్‌ను బరిలోకి కాంగ్రెస్ నాయకత్వం బరిలోకి దింపింది. బీసీ కోటాలో మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో వజ్రేష్ యాదవ్ ఎంపిక పట్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఆయనకు బీఫారం అందచేసింది. వజ్రేష్ యాదవ్ కు కూడా రాజకీయాలకు కొత్త కాదు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అప్పటి నుంచే రాజకీయాలను ఒంటబట్టించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2014లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా మారిపోయారు.
2014 ఎన్నికల్లో పోటీ చేసి...
2014 ఎన్నికల్లో తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరడంతో 2018 నాటికి ఈయన కూడా హస్తం గూటికి చేరుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మరొకసారి మేడ్చల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బలమైన మల్లారెడ్డితో తలపడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో ఎం. సుధీర్ రెడ్డి గెలవగా, 2018 ఎన్నికల్లో మల్లారెడ్డి 88 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి మంత్రి అయ్యాడు. అయితే ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది.
గెలుపు కోసం ఇద్దరూ.
ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంతో మల్లారెడ్డికి ఈసారి ముచ్చెటమలు పడుతున్నాయి. అయితే తనను ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆయన యూనివర్సిటీలు, ఆసుపత్రుల వద్ద జరిగిన భూ కుంభకోణాలు, అనుచరుల ఆగడాలు మంత్రి మల్లారెడ్డికి మైనస్ గా మారనున్నాయి. మరోవైపు వజ్రేష్ యాదవ్ మాత్రం ఒకసారి ఓటమి పాలయిన నేతగా గుర్తింపు పొందారు. ఈ నియోజకవర్గంలో నాగారం, ఘట్కేసర్, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తుంకుంట, దమ్మాయిగూడ, పోచారం మండలాలున్నాయి. ఈ మండాలాల్లో బీసీ జనాభా కూడా అధికంగానే ఉండటంతో వజ్రేష్ యాదవ్ తనను ఈసారి ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నారు. మరి మల్లయుద్ధంలో మంత్రి మల్లారెడ్డిని వజ్రంతో తలపడుతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలియాలంటే డిసెంబరు 3వ వరకూ ఆగాల్సిందే.
Next Story