Mon Dec 23 2024 08:09:03 GMT+0000 (Coordinated Universal Time)
BRS : దగ్గరకు తీసుకున్నారని సంతోషించకుమా.. నామా.. ఫలితాల తర్వాత?
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతుంది
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రేమించినప్పుడు అంతగా మరో వ్యక్తిని ప్రేమించడు. ద్వేషించినా అంతే. పక్కన పెట్టేయదలచుకుంటే ఎవరు చెప్పినా వినరు. ఆ సంగతి అందరికీ తెలుసు. అందుకే కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. పూసుకున్నా పాపమే. దూరమున్నా నేరమేనన్నట్లుగా ఉంటుంది గులాబీ బాస్ తోని యవ్వారం. గతంలో ఎందరో నేతలను దగ్గరకు తీసుకున్న ఆయన తర్వాత దూరం పెట్టారు. ఒక్కో టైంలో ఒక్కొక్కరిని దగ్గరకు తీయడం ఆయనకు అలవాటు అంటూ ఆఫ్ ది రికార్డుగా ఆ పార్టీ నేతలే అంటుంటారు. కానీ కేసీఆర్ మాత్రం తాను అనుకున్నట్లు జరగకుంటే అవతలి నేత ఎంతటి వాడైనా సరే దరి చేరనివ్వడు.
తుమ్మలనూ అంతే...
గతంలో తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ మామూలుగా ప్రేమించలేదు. 2014లో అధికారంలోకి రాగానే ఓటమిపాలయిన తుమ్మలను తీసుకు వచ్చి ఎమ్మెల్సీని చేశారు. అంతటితో ఊరుకున్నారా? అంటే లేదు. వెంటనే మంత్రిని చేసి పారేశారు. ఇక అందరూ తుమ్మల దశ తిరిగిందనుకున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నంత వరకూ తుమ్మలకు తిరుగులేదని భావించిన వారు కూడా అనేకమంది ఉన్నారు. ఆ తర్వాత పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకున్నారు. మొన్నటి వరకూ వేదికపై పక్కనే కూర్చుని పెట్టుకుని ప్రశంసించడాన్ని ఎవరూ ఇంకా మరిచిపోరు. అలాంటి తుమ్మలను తీసి ఆవలపడేశారు. కేవలం ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం చేయకపోవడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. చివరకు ఈ ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పొంగులేటినీ పక్కకు...
ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంతే. పొంగులేటి వైసీపీ ఎంపీగా ఉన్నా తమ పార్టీ నేతల ద్వారా ఆహ్మానించుకుని మరీ గులాబీ గూటికి రప్పించుకున్నారు. రాజకీయంగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అయితే పొంగులేటి పరిస్థితి కూడా అంతే. ఖమ్మం జిల్లాలో గ్రూపు రాజకీయాలతో పాటు గత ఎన్నికల్లో ఓటమికి ఆయనే కారణమని భావించి పొంగులేటి ఫేస్ చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇచ్చి అయినా పొంగులేటిని పక్కన పెట్టుకుంటారనుకున్న వారికి గులాబీ దళపతి షాక్ ఇచ్చారు. అంతే ఇక పొంగులేటి కూడా తన దారి చూసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో చేరిపోయారు. కేసీఆర్ కు కోపం వచ్చిందంటే క్యాష్ పార్టీ అనో... క్యాస్ట్ అనో అస్సలు చూడరు. ఈ విషయం అర్థమయినా సరే లీడర్స్ కు మరో దారి లేదు. ఆయన దగ్గరకు తీసుకున్నప్పుడు దగ్గరవ్వాలి. లేకుంటే లేదు.
నామా నెత్తిన వేసుకుని...
ఇప్పుడు నామా నాగేశ్వరరావు వంతు వచ్చిందంటున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు లేవు. కేసీఆర్ మాత్రం నామాపైనే గెలుపు బాధ్యతలను ఉంచారు. అంతా ఆయనకే అప్పగించారు. ఎక్కువ స్థానాలను ఖమ్మం నుంచి గెలవాలని నామాకు టార్గెట్ విధించినట్లు తెలిసింది. నామా అంతా తాను నెత్తిన వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రేపు అటూ ఇటూ అయితే మాత్రం నామా పరిస్థితి కూడా అంతేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎన్నికల ఫలితాలను బట్టే నామా నాగేశ్వరరావును కేసీఆర్ దగ్గరకు తీసుకుంటారా? లేదా దూరం పెడతారా? అన్నది తెలియాల్సి ఉంది. నామా అందుకే టెన్షన్ లో కనిపిస్తున్నారు. కమ్యునిస్టులు కూడా జత కలవడంతో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది డిసెంబరు 3న తేలాల్సిందే.
Next Story