Fri Nov 22 2024 17:17:41 GMT+0000 (Coordinated Universal Time)
కమ్యునిస్టులకు ఇప్పటి వరకూ అయితే సీట్లు... ఫ్రెండ్లీ కంటెన్ట్ అంటూ
తెలంగాణలో కాంగ్రెస్, కమ్యునిస్టులకు మధ్య పొత్తు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి
తెలంగాణలో కాంగ్రెస్, కమ్యునిస్టులకు మధ్య పొత్తు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. కామ్రేడ్లకు కేవలం మూడు సీట్లను మాత్రమే కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధమయింది. సీపీఐకి రెండు, సీపీఎంకు ఒక్క స్థానాన్ని కేటాయించడానికి రెడీ అయింది. అయితే ఇందుకు మాత్రం కమ్యునిస్టు పార్టీలు ససేమిరా అంటున్నాయని తెలిసింది. తమకు పట్టున్న ప్రాంతాల్లోనే తాము సీటు కేటాయించాలని కోరుతున్నామని, అందుకు అంగీకరించకపోతే ఫ్లెండ్లీ కంటెస్ట్కు దిగుతామన్న సంకేతాలను పంపుతుంది.
కలిసి నడిచేందుకు...
ఇండియా కూటమిలో భాగమైన వామపక్షాలు తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో కలసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అధికార బీఆర్ఎస్ పంచన చేరి ఆ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పట్టించుకోక పోవడంతో కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయిపోయారు. కాంగ్రెస్ కూడా వామపక్ష పార్టీలతో కలసి నడిచేందుకు ఓకే చెప్పింది. గత కొద్దిరోజులుగా వామపక్ష పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.
నాలుగు స్థానాలు...
సీపీఐ, సీపీఎంకు ఎన్నిక స్థానాలు ఇస్తారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ రెండు పార్టీలకు నాలుగుకు మించి స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. తెలంగాణలో కొంత బలంగా ఉన్న సీపీఐకి రెండు స్థానాలను కేటాయించినట్లు తెలిసింది. చెన్నూరు, కొత్తగూడెం స్థానాలను సీపీఐకి కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే సీపీఎంకు మాత్రం మిర్యాలగూడ ఒక్కటే కేటాయించినట్లు సమాచారం. తమకు ఖమ్మం జిల్లాలో మరో స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు. పాలేరు లేదా మునుగోడుల్లో ఒకటి కేటాయించాలన్నది వామపక్షాల పట్టుగా కనిపిస్తుంది.
సీపీఎంకు ఒకటే...
అయితే ఇందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించకపోతే మునుగోడులో ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తామని కూడా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినాయకత్వం ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. అందుకు కాంగ్రెస్ హైకమాండ్ ససేమిరా అంటుంది. స్నేహపూర్వక పోటీ అంటే బీఆర్ఎస్ లబ్ది పొందే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు మిర్యాలగూడ సీపీఎంకు ఇవ్వవద్దంటూ కాంగ్రెస్ నేతలు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థినే బరిలోకి దింపాలని మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మొత్తం మీద కామ్రేడ్లతో చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు సాయంత్రానికి ఒక రూపుకు వచ్చే అవకాశముంది.
Next Story