Thu Dec 19 2024 06:55:24 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : మంత్రుల్లో దడ...దడ... గెలుపు అంత సులువు కాదంటున్నారే
తెలంగాణ ఎన్నికలు ముగిసినా ఇంకా ఫలితాలు వెలువడకపోవడంతో ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు
తెలంగాణ ఎన్నికలు ముగిసినా ఇంకా ఫలితాలు వెలువడకపోవడంతో ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రధానంగా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టిక్కెట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఆర్థికంగా, సామాజికంగా బలమున్న వారే. అందుకే పెద్దగా ఆలోచించలేదు గులాబీ బాస్. ఇప్పటికిప్పుడు కొత్త వారికి టిక్కెట్ ఇచ్చినా ఎన్నికల సమయానికి పార్టీ క్యాడర్ ను సమన్వయం చేసుకోలేరని భావించి ఉన్న వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చేశారు. వారిని చూసి కాదు.. ప్రభుత్వం ఏది వస్తే బాగుంటుందో చూసి గెలిపించాలని ప్రజలను పదే పదే కోరారు.
వేవ్ ఉండటంతో...
అయితే అనేక నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రచారంలోనే బయటపడింది. కొందరు గ్రామస్థులు తమ గ్రామంలోకి రానివ్వ కుండా అడ్డుకున్న దృశ్యాలు అనేకం చూశాం. అయితే కేసీఆర్ క్రేజ్ ముందు ఇవన్నీ కొట్టుకుపోతాయని భావించిన నేతలు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. కానీ పోలింగ్ తర్వాత వస్తున్న అంచనాలు వారిలో గుబులు రేపుతున్నాయి. ఖచ్చితంగా గెలుస్తామని భావించిన నేతల్లో కూడా సందేహాలు స్టార్ట్ అయ్యాయంటున్నారు. ప్రత్యర్థి అనూహ్యంగా పుంజుకోవడం, ప్రత్యర్థి పార్టీ వేవ్ బాగా పనిచేయడం వల్ల ఈసారి గెలవడం కష్టమేమోనన్న ఆందోళనలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలున్నారు.
ఇచ్చిన డబ్బును...
ఇక మంత్రులు కూడా దీనికి మినహాయింపు కాదు. చాలా మంది మంత్రులు కూడా ఈసారి వెనకబడి ఉన్నారని వారంతట వారే సన్నిహితుల వద్ద మొత్తుకుంటున్నారు. పంపిణీ చేసిన డబ్బు ఓటర్లకు చేరలేదన్న ఫిర్యాదులు కూడా వారిని కలవర పెడుతున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు డబ్బులు నొక్కేయడంతో చాలా మంది ఓటర్లకు డబ్బులు చేరలేదన్న సమాచారంతో మంత్రుల్లో కొందరికి నిద్ర పట్టలేదట. తాము పంపిణీ చేయమని ఇచ్చిన డబ్బును ఏం చేశారంటూ ముఖ్య అనుచరులను పిలిచి ఆరా తీయడం మొదలు పెట్టారని విశ్వసనీయంగా తెలిసింది. అనేక చోట్ల తమకు డబ్బులు అందలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
అనుచరులపై గుర్రుగా...
నగరంలో ఉన్న ఇద్దరు మంత్రులకు ఇదే పరిస్థితి ఉందంటున్నారు. అలాగే ఉత్తర తెలంగాణలో ఇద్దరు మంత్రులు కూడా తాము ఈసారి మాజీలుగా మారక తప్పదని గ్రహించినట్లు చెబుతున్నారు. అందుకే సరిగా ఓటు వేయించలేని తమ అనుచరులపై చిర్రబుర్రులాడుతున్నట్లు తెలిసింది. కొందరు మంత్రులు ముఖ్యమైన అనుచరులే మోసం చేశారని భావించి వారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదట. దాదాపు ఐదారుగురు మంత్రులది ఇదే పరిస్థితి. ఇన్నాళ్లు కేబినెట్ లో ఉండి రారాజుగా మెలిగి చివరకు కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నామని కొందరు వాపోతున్నారని తెలిసింది. అయితే ఫలితాలు రాకముందే వీరు ఎలా నిర్ణయానికి వస్తారని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలోని ఐదారుగురు మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారన్నది సర్వేలు కూడా స్పష్టం చేశాయి.
Next Story