Telangana: తెలంగాణలో మకాం వేయనున్న కాంగ్రెస్ అగ్రనేతలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోయాడం.. విమర్శలు.. ప్రతి విమర్శలు, హామీలు, వినూత్న రీతిలో ప్రచారాలు ఇలా రకరకాలుగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించుకుంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏఐసీసీ టాప్ క్యాడర్ తెలంగాణలో మకాం వేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నెల 17 నుంచి రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర ముఖ్య నేతలు తెలంగాణలో మకాం వేసి పలు సభలకు హాజరు కానున్నారు. ఎలాగైన సరే ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని బలంగా ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. తమ పార్టీ వస్తే ఎవ్వరు కూడా చేయని అభివృద్ది చేసి చూపిస్తామంటూ భరోసా ఇస్తున్నారు.
ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజుకు మూడు సభల చొప్పున సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అందుకే స్థానిక నాయకులతో పాటు ఢిల్లీ నుంచి కూడా అధినాయకత్వం హైదరాబాద్లో మకాం చేయబోతోంది. నవంబర్లో మొత్తం 60 సభలో వరకు నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకి రెండు హెలికాప్టర్లను కేటాయించింది ఏఐసీసీ. ఇప్పటికే ఒక హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి రోజుకు మూడు సభల చొప్పున తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
చత్తీస్గడ్ ఎన్నికలు 17వ తేదీన ముగియనుండడంతో రాహుల్, ప్రియాంక తెలంగాణకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 17 నుంచి రాహుల్ హైదరాబాద్లో ఉండబోతున్నట్టు సమాచారం. ఇక రాహుల్, ప్రియాంకతో పాటు మల్లికార్జున ఖర్గే తెలంగాణ టూర్ ని షెడ్యూల్ చేస్తున్నారు. సుమారు ఆరు రోజులపాటు ముగ్గురు తెలంగాణలోనే ఉండి పలు సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ 15 రోజుల్లో సోనియాగాంధీతో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ టీమ్ ఒకటి తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది. నియోజకవర్గాల వారీగా 119 నియోజకవర్గాల్లో ఏఐసిసి వారు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పర్యవేక్షించబోతున్నారు.