Thu Dec 19 2024 13:01:48 GMT+0000 (Coordinated Universal Time)
Komatireddy : కోమటిరెడ్డి సీటు గల్లంతు.. రీజనేంటి?
బీజేపీ కేంద్ర నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టిక్కెట్ మాత్రం పెండింగ్‌లో పెట్టింది.
భారతీయ జనతా పార్టీ తొలి జాబితా విడుదలయింది. తొలి జాబితాలో 52 మంది పేర్లను అధినాయకత్వం ప్రకటించింది. అయితే ముఖ్యనేతలందరి పేర్లను ప్రకటించిన కేంద్ర నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టిక్కెట్ మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఆయన మీద కొన్ని అనుమానాలు ఉండటమే పెండింగ్‌లో పెట్టడానికి కారణమని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇటీవల పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో పాటు ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకనే ఆయన పేరును తొలి జాబితాలో ప్రకటించలేదు.
రాజీనామా చేసి...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉండి బీజేపీలో చేరిపోయారు. ఆయన 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయనతో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ కమలం పార్టీలో చేరిపోయారు. దీంతో ఉప ఎన్నికలు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. వ్యక్తిగతంగా మునుగోడులో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బీజేపీలో చేరిక ఆయనకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు.
సోదరుడు సిఫార్సుతో...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఆయన తమ్ముడు పార్టీని వీడినా కాంగ్రెస్ ను వీడకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. పార్టీలో కీలకంగా మారారు. అయితే బీజేపీ గ్రాఫ్ పడిపోవడం, కాంగ్రెస్ ఇమేజ్ కొంత పెరగడంతో తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సోదరుడు వెంకటరెడ్డి సహకారం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టాన్ని ఒప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకువస్తారన్న ప్రచారం జరుగుతుంది.
ఈసారి ఇక్కడి నుంచే....
అయితే ఈసారి ఆయన మునుగోడు నుంచి పోటీ చేయకుండా ఎల్.బి.నగర్ నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్.బి.నగర్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఒకపక్క స్థానిక నాయకత్వంతో పాటు మధుయాష్కి గౌడ్ కూడా ఎల్.బి.నగర్ నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో ఎల్.బి.నగర్ నియోజకవర్గం అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసమే రిజర్వ్ చేశారన్న టాక్ పార్టీలో బలంగా నడుస్తుంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరతారంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సిందే.
Next Story