Sun Dec 22 2024 22:43:18 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ కరీంనగర్లో అంత సేపు మాట్లాడారా? కారణం తెలుసా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ సభలో ఎక్కువ సేపు ప్రసంగించారు. ప్రసంగంలో కూడా వైవిధ్యంగా కొనసాగింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ప్రజా ఆశీర్వాద సభల పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గత నెల 15వ తేదీన ఆయన తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కేసీఆర్ తర్వాత పది రోజులకే అందరికంటే ముందుగా మ్యానిఫేస్టోను కూడా విడుదల చేశారు. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే వాటి నగదును పెంచుతామని హామీ ఇచ్చారు. అంతే కాదు కొన్ని కీలకమైన అంశాలకు మ్యానిఫేస్టోలో చోటు కల్పిస్తూ గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయాలకే కేటాయిస్తామని చెప్పారు. హుస్నా బాద్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రజా ఆశీర్వాద సభలు మధ్యలో దసరా, దీపావళి పండగలకు కొంత విరామం ఇచ్చి మిగిలిన ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
దాదాపు నెల రోజుల నుంచి...
గత నెల 15వ తేదీన మొదలుపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 28వరకూ కేసీఆర్ కొనసాగించనున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఆయన టూర్ ప్లాన్ చేశారు. అయితే కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసంగించేవారు. తర్వాత సభకు వెళ్లాల్సి రావడం, వాతావరణం అనుకూలించదని, హెలికాప్టర్ లో వచ్చానని, వారు తొందర చేస్తున్నారని ప్రతి సభలో చెబుతుండేవారు. ప్రతి సభ మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత మొదలయి ఐదున్నర గంటలలోపు మూడు సభలను ముగించుకుని వెళతారు. ప్రధానంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ఆగమాగం అవుతారని ప్రజలను ఎక్కడికక్కడ హెచ్చరిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ పైనే ఇప్పటి వరకూ...
ఇప్పటి వరకూ జరిగిన సభల్లో బీజేపీపై చేసిన విమర్శలు తక్కువే. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనే భావించి ఆ పార్టీపైనే విరుచుకుపడుతున్నారు. కానీ తాజాగా జరిగిన కరీంనగర్ సభకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీపైనే ఎక్కువ విమర్శలు చేశారు. అంతే కాదు రెండు గంటలకు సభ ప్రారంభమయినా దాదాపు నలభై నిమిషాలకు పైగానే ఆయన ప్రసంగం సాగింది. ఈ సమావేశంలో బీజేపీపైనే ఎక్కువగా విరుచుకుపడ్డారు. మోదీ జిల్లాకు ఒక మెడికల్ కళాశాలలు దేశమంతా ఇచ్చినా తెలంగాణకు ఇవ్వలేదని, నవోదయ స్కూళ్లు కూడా అంతేనంటూ విమర్శించారు. అలాగే 24 గంటలూ తాగునీటి సరఫారాను ఈసారి అధికారంలోకి రాగానే చేస్తామన్నారు.
కానీ ఇక్కడ మాత్రం...
ఇందుకు ప్రధాన కారణం అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బరిలో ఉండటమే. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ కరీంనగర్ పార్లమెంటును కారు పార్టీ చేజార్చుకుంది. అందుకే ఇక్కడ ఎక్కువ సమయం కేటాయించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కరీంనగర్ లో గంగుల కమలాకర్ ను గెలిపించాలని ఆయన పదే పదే కోరడం వెనక కూడా ఇదే కారణం. వినోద్ ను ఎంపీగా గెలిపించుకోకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో తెలిసిందా? అని కూడా ప్రశ్నించారు. స్టీరియో టైపు ప్రసంగం కాకుండా కరీంనగర్ లో ఆయన ప్రసంగం వైవిధ్యంగా కొనసాగింది. బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కోసమే ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించారని చెబుతున్నారు. మిగిలిన సభలకంటే కరీంనగర్ సభ భిన్నంగా జరగడం... ప్రసంగాల్లో కొత్త అంశాలు చోటు చేసుకోవడం, సమయం ఎక్కువ కేటాయించడం అందుకేనంటున్నారు.
Next Story