Mon Dec 23 2024 15:14:56 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కాంగ్రెస్ వస్తే ఇక ఇంతే సంగతులు
ఓటు ను ఆలోచించి వేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటు వస్తుందని ఆయన అన్నారు
ఓటు ను ఆలోచించి వేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటు వస్తుందని ఆయన అన్నారు. నర్సంపేటలో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భయానకమైన పరిస్థితి ఉండేది అన్నారు. అన్ని రంగాల్లో వెనకబడి ఉండటమే కాకుండా నీళ్ల కోసం కొట్లాటలు జరిగేవన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నామని కేసీఆర్ తెలిపారు.
నాణ్యమైన ఉచిత విద్యుత్తు...
రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్నది తెలంగాణలో మాత్రమేనని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మాత్రం రైతులకు మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలునని చెబుతున్నారన్నారు. అలాగే రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని అన్నారు. రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ కే ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు, రైతు బీమాలు దుబారా అంటూ తీసివేస్తారన్నారు. ధరణిని తెచ్చి రైతుల భూములకు భరోసా కల్పించామని కేసీఆర్ అన్నారు.
ధరణిని తీసేస్తే...
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీస్తే బంగాళాఖాతంలో వేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, అదే జరిగితే మళ్లీ పాత పద్ధతి వస్తుందని, వీఆర్వో, తాహసిల్దార్ కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ధరణితో ఆ పీడ పోయిందన్నారు. ధరణి ఉంది కాబట్టి రైతు బంధు డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు. నాయకుల వెనక ఉన్న పార్టీ చరిత్ర చూసి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ వస్తే అన్ని పథకాలు పోతాయని ఆయన అన్నారు. అందుకే ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు.
Next Story