Mon Dec 23 2024 06:15:25 GMT+0000 (Coordinated Universal Time)
మామూలుగా లేదుగా.. మరోసారి గెలుపు దిశగానే యత్నం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఆయన అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోను రూపొందించారు. రైతులు, యువత, మహిళల లక్ష్యంగా మ్యానిఫేస్టోను తయారు చేశారు. తెలంగాణలోని ప్రధాన వర్గాలను గులాబీ పార్టీ వైపు తిప్పేలా మ్యానిఫేస్టోలో ప్రతి అక్షరాన్ని ఆయన పదిల పర్చారు. తాను రూపొందించిన మ్యానిఫేస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామన్న హామీతో ఆయన ప్రజల ముందుకు వెళుతున్నారు. కారు పార్టీ అభ్యర్థులను ఆదరించాంటూ అభ్యర్ధించనున్నారు. మ్యానిఫేస్టో గురించి కేసీఆర్ మాటల్లో... ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడారంటే....?
రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు అన్ని రంగాల్లో వెనకబడి ఉండేదన్నారు. అయితే తాము వచ్చిన తర్వాత సాగు, తాగు నీరు అందించడంలో సఫలమయ్యామని తెలిపారు. గతంలో ఇచ్చిన మ్యానిఫేస్టోను తూచ తప్పకుండా అమలు చేశామని చెప్పారు. మ్యానిఫేస్టోలో లేని అంశాలను కూడా అమలు చేశామని, కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలను మ్యానిఫేస్టోలో లేవన్నారు. మేనిఫేస్టోలో గతంలో పది శాతం చెప్పామని, అమలు చేసింది 90 శాతం అని ఆయన అన్నారు. మైనారిటీ సంక్షేమానికి బీఆర్ఎస్ పాటు పడిందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ,బీసీల అభ్యున్నతికి కూడా తాము కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేడు తెలంగాణలో భూమి బంగారంలా మారిందన్నారు. దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామన్న ఆయన మైనార్టీ బడ్జెట్ ను పెంచామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. యువతకు విదేశీ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పారు.
01. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా : 93 లక్షల కుటుంబాలకు గెలిచిన తర్వాత వందశాతం ప్రీమియం చెల్లించి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమాను అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి మూడు వేలరూపాయలు ఖర్చవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఐదు లక్షలు ఆ కుటుంబానికి చేరతాయి. ఎల్ఐసీ ద్వారా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు.
02. అన్నపూర్ణ : ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం. వచ్చే ఏప్రిల్ మే నెల నుంచి రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.
03. ఆసరా పింఛన్లు : వితంతువులు, వృద్ధులకు, వికలాంగులు, ఒంటరి మహిళలు, విధివంచితులకు ఐదు వేల రూపాయలు ఇస్తాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే మార్చి తర్వాత మూడు వేలు, ప్రతి ఏడాది ఐదు వందలు పెంచుతామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై భారం పడదని ఆయన చెప్పారు.
04. దివ్యాంగులకు : నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని తెలిపారు. ఐదు లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది పెంచుకుంటూ వారికి సాయం అందిస్తామని చెప్పారు.
05. రైతు బంధు : రైతుబంధు పది వేల రూాపాయలను క్రమంగా పదహారు వేల రూపాయలుకు పెంచుతూ పోతామన్నారు. తొలి ఏడాది పన్నెండు వేల రూపాయలు ఇస్తామని, ఐదేళ్లకు పదహారు వేలకు తీసుకెళతామని కేసీఆర్ తెలిపారు.
06. సౌభాగ్యలక్ష్మి : అర్హులైన మహిళలకు మూడు వేల రూపాయలు గౌరవభృతి ఇవ్వాలని నిర్ణయం.
07. గ్యాస్ ధరలు : గ్యాస్ ధరలు తగ్గిస్తూ అర్హులైన లబ్దిదారులందరికీ నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని నిర్ణయం.
08. కేసీఆర్ ఆరోగ్య రక్ష : ఆరోగ్య శ్రీ పరిమితిని పదిహేను లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం
09. ఇళ్ల స్థలాలు : పదకొండు లక్షల మంది నిరాశ్రయులుగా ఉన్నారని, వారికి కూడా కట్టిస్తామని తెలిపారు. హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్ రూంలు కడతాం. ఇళ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే జాగాలు ఇస్తుంది.
10. గురుకులాలు : విద్యా ప్రమాణాలు పెంచేందుకు రెసిడెన్షియల్ కళాశాలలను పెంచుతాం. 119 నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పిల్లలకు గురుకుల విద్యను అందించేందుకు నిర్ణయించామని చెప్పారు.
11. మహిళ గ్రూపులు : స్వశక్తి మహిళ గ్రూపులకు సొంత భవనాలను నిర్మిస్తాం. దశల వారీగా భవనాలను నిర్మించి ఇస్తామని తెలిపారు.
12. అసైన్ల్యాండ్ : అసైన్ల్యాండ్స్ మీద ఆంక్షలను ఎత్తివేసి సాధారణ పట్టాదారులకు కల్పించే హక్కును కల్పిస్తామని తెలిపారు.
13. ప్రభుత్వోద్యోగులు : సీపీఎస్ నుంచి ఓపీఎస్ కు మార్చాలన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆచరణాత్మకమైన విధానాలను అవలంబిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం అధికారులతో కమిటీని నియమిస్తాం
Next Story