Mon Nov 25 2024 03:55:42 GMT+0000 (Coordinated Universal Time)
KCR : చేర్యాల సభలో రేవంత్ రెడ్డి పై కేసీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి పేరు రైఫిల్ రెడ్డి అని ఆ పార్టీ నేతలే పెట్టారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి పేరు రైఫిల్ రెడ్డి అని ఆ పార్టీ నేతలే పెట్టారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పుల మోసుకుని తిరిగాడని, తర్వాత ఉద్యమ కాలంలో ఆయన రైఫిల్ పట్టుకుని తిరిగాడన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నెలకు రెండు వేల పింఛను ఇస్తే తాను ముక్కుకు నేలకు రాస్తానని అన్నారు. భట్టి విక్రమార్క ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెబుతున్నాడని, ధరణిని తీసేస్తే రైతు బంధు రాదని, భీమా రాదని, పంటలు కొనుగోలు చేసిన మొత్తం కూడా రాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ వస్తే...
అందుకే జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తారని అన్నారు. కరెంటు బాధలు తప్పవని, ఇప్పటికైనా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తాను కోరుకునేది ఒక్కటేనని మూడు కోట్ల వరి ధాన్యాన్ని పండిస్తున్న తెలంగాణను మళ్లీ పాడు చేసుకోవద్దని కోరారు. మీటర్లు పెట్టలేదని మోడీ ఇరవైఐదు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని, అయినా తాను వెనక్కు తగ్గలేదని, మోదీ ఆర్డర్ వేసినా తాను పాటించలేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలతో కేసీఆర్ దుబారా చేస్తున్నారన్నారు.
పదేళ్లలో అన్ని రంగాల్లో...
గడచిన పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రానున్న కాలంలో అన్ని రకాలుగా ఇంకా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళదామని తెలిపారు. కొత్త జిల్లాలకు బీజేపీ ప్రభుత్వం నవోదయ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చాక చేర్యాలను డివిజన్ ను చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలను రూపొందించి తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు. చేర్యాల వస్తే తన సొంత ఊరు వచ్చినట్లుందన్నారు. మల్లన్న సాగర్ నీళ్లు చేర్యాలకు తరలిస్తామని తెలిపారు. ఇక ఈ ప్రాంతంలో కరువు ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పాతరోజులు వస్తాయని హెచ్చరించారు.
Next Story