BSP : హంగ్ వస్తే కీలకం అవుతుందా... ఏనుగు తెలంగాణలో హిస్టరీ క్రియేట్ చేయనుందా?
తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ కీలకంగా మారనుంది. సరైన అభ్యర్థులను నిలపడంతో ప్రధాన పార్టీలు టెన్సన్ పడుతున్నాయి
ఎన్నికల్లో ఎవరినీ తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. ప్రజల్లో బలపడాలని మాత్రమే కాకుండా గెలుపు దిశగా కూడా పార్టీలు ప్రయత్నిస్తాయి. పొత్తులతో రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీలు మల్లగుల్లాలు పడుతుండగా ఒక జాతీయ పార్టీ మాత్రం అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి ఎన్నికల్లో గెలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఏమీలేని చోట అద్భుతం సృష్టించాలని శ్రమిస్తుంది. ఏమో గుర్రం ఎగరావచ్చు. అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ, అధికారాన్ని శాసించే స్థాయికి మాత్రం ఖచ్చితంగా ఎదుగుతుందన్నది విశ్లేషకుల అంచనా. అదే బహుజన్ సమాజ్ పార్టీ. ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో అనేక చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెడుతుంది. టెన్షన్ పెట్టడమే కాదు.. కొన్ని స్థానాల్లో గెలుపు దిశగా కూడా ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.