Mon Nov 18 2024 12:35:50 GMT+0000 (Coordinated Universal Time)
నోటిఫికేషన్‌కు ముందే డబ్బులు చేరాల్సిన చోటకు చేరాయట
దొరుకుతున్న కరెన్సీ కట్టలు మాత్రం రాజకీయ నేతలకు సంబంధించినవి కావట
దొరుకుతున్న డబ్బంతా రాజకీయ నేతలదేనా? అదే అయితే ఇప్పుడే ఎందుకు తరలిస్తున్నారు? ఎప్పుడూ ఇలాంటి తరహా చెక్‌పోస్టులుంటే ఎప్పుుడూ కరెన్సీ కట్టలు దొరుకుతాయన్నది కాదనలేని వాస్తవం. కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే కోట్ల కోట్లు దొరుకుతుండటంతో నోరెళ్లపెడుతున్నాం కానీ ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అంటున్నారు అనేక మంది. రాజకీయ నేతలు అంత తెలివి తక్కువ వాళ్లా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబ్బులను తరలించడానికి? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.
ఇదేమీ రహస్యమా?...
ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అందరికీ తెలుసు. నెల రోజుల ముందు నుంచే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల కసరత్తు కూడా నెల రోజుల ముందు నుంచే తమ కసరత్తును ప్రారంభించింది. తెలంగాణకు వచ్చి ఇక్కడి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల సన్నద్ధానికి సమాయత్తమవుతున్నామని సంకేతాలను ఇచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎవరైనా డబ్బులు తరలిస్తారా? అంటే నవ్వుకోవడానికి తప్ప మరేమీ లేదన్నది యదార్థం.
నోటిఫికేషన్ కు ముందే...
నోటిఫికేషన్ కు ముందే ఎక్కడకు చేరాల్సిన డబ్బులు అక్కడ చేరిపోయాయి. రాజకీయ నేతలు తెలివిమీరి పోయారు. ఇవేమైనా వారికి కొత్తగా జరుగుతున్న ఎన్నికలా? ఈ చెక్‌పోస్టులు.. తనిఖీల గురించి వారికి తెలియదా? అంటే ఎవరైనా నవ్వి పోతారు. ముందుగానే పొలిటికల్ పార్టీలు నగదును సిద్ధం చేసుకున్నాయి. అవి చేరాల్సిన వారికి చేరిపోయాయి. ఎక్కడో ఎవరో కొందరు తప్పించి మెజారిటీ నేతలు ఇప్పటికే డబ్బులు తాము ఎక్కడ దాచి పెట్టాలో అక్కడ దాచి పెట్టేశారు. ఇది పార్టీలకతీతంగా జరుగుతున్న తంతు. కానీ ఇప్పుడు తనిఖీల్లో దొరుకుతున్న నగదు అంతా కేవలం హవాలా సొమ్ము మాత్రమేనంటున్నారు.
101 కోట్లు స్వాధీనం...
ఇప్పటి వరకూ తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ఏర్పడిన తర్వాత 101 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. 2.60 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 38.45 కోట్ల విలువైన బంగారాన్ని తనిఖీల్లో భాగంగా పట్టుకున్నామని తెలిపారు. 3.42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 71 కిలోల బంగారం, 429 కిలోల వెండిని సీజ్ ను చేశామని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ తంతు ఎన్నికలు జరగనప్పుడు కూడా జరుగుతున్నదేనంటారు. ఇప్పుడు తనిఖీల్లో బయటపడుతున్నాయి కానీ, అదంతా మాత్రం రాజకీయ నాయకులది కాదన్నదే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. తనిఖీలు నిరంతరం జరగాలని, అప్పుడే బ్లాక్ మనీతో పాటు హవాలా సొమ్ము ప్రభుత్వ పరం అవుతుందన్నది జనం అభిమతంగా ఉంది.
Next Story