Mon Dec 23 2024 07:58:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : ఒక్కసారి కూడా గెలవలేదు... అయినా ఎవరు గెలిచినా బీఆర్ఎస్ లోకే
మహేశ్వరం నియోజకవర్గంలో ఈసారి హోరాహోరు పోరు జరుగుతుంది. ఎవరు గెలిచినా బీఆర్ఎస్ లోకి వెళ్లే నియోజకవర్గమిది
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గం. ఈసారి గెలిస్తే రికార్డు అవుతుంది. చరిత్ర తిరగరాసినట్లే అవుతుంది. 2009లో ఏర్పడిన మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంత వరకూ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. పేరుకు మహేశ్వరం నియోజకవర్గం గ్రామీణ ప్రాంతమైనా ఇందులో ఎక్కువ భాగం పట్టణ ఓటర్లున్నారు. అధిక భాగం పట్టణ ఓటర్లుండటం కారణంగా ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే హోరా హోరీ పోరు జరగనుంది. బీజేపీ కూడా ఇక్కడ అంతో ఇంతో ప్రభావితం చూపించినా అయితే గెలిచే స్థాయిలో మాత్రం లేదు. అందుకే మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య మహేశ్వరం నియోజకవర్గంలో పోరు మామూలుగా ఉండదు.
ఇప్పటి వరకూ...
2009లో నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎన్నికల్లో సబిత ఇంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలవలేదు. అప్పుడు అనూహ్యంగా టీడీపీ విజయం సాధించింది. తీగల కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో తిరిగి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్నాళ్లకు ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. చివరకు కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా బాధ్యతలను చేపట్టారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మరోసారి మహేశ్వరం నుంచి బరిలోకి దిగారు. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా....
ఈసారి కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని మార్చింది. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. దీంతో మరోసారి ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఏ పార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఇక్కడ ఇంత వరకూ గెలవకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది. మరోవైపు టీడీపీ కూడా పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కు బదిలీ అవుతాయన్న నమ్మకంతో హస్తం పార్టీ ఉంది. ఈసారి కూడా తమదే గెలుపు అన్న ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉండటమే కారణమని అంచనాలు వినపడుతున్నాయి.
బీఆర్ఎస్ కూడా బలంగా...
మరోవైపు ఇక్కడ ఎవరు గెలిచినా బీఆర్ఎస్ లోకి రావాల్సిందే. గతంలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వారే. అందుకే బీఆర్ఎస్ కు పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది. అందులోనూ హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధితో పాటు జరుగుతున్న పనులు తమకు విజయం చేకూరుస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పై నెలకొన్న వ్యతిరేకతతో పాటు సబిత ఇంద్రారెడ్డి సొంత బలగం కూడా పార్టీ విజయానికి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు. మరి గత రికార్డులను చెరిపేస్తూ సబితా ఇంద్రారెడ్డి గెలుస్తారా? లేక తిరిగి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారా? అన్నది తేలాల్సి ఉంది.
Next Story