Fri Nov 22 2024 20:51:34 GMT+0000 (Coordinated Universal Time)
గెలుపు గుర్రాలు సరే.. గేట్లు దాటే వారిని గుర్తించేదెలా?
కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించింది. అయితే గెలిచిన వారిలో ఎంతమంది పార్టీలో ఉంటారన్న సందేహం కలుగుతుంది
గెలుపు గుర్రాలంటూ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. చూసేందుకు తొలి జాబితా బాగానే ఉంది. సామాజికవర్గాల పరంగా చూసుకున్నా అంతా సజావుగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ముందుంది అసలు పండగ. ఇల్లు అలకగానే సరిపోదన్నట్లుగా... ముందు అధికార బీఆర్ఎస్ ను వెనక్కు లాగి ముందుకు రావాలి. ఆ తర్వాత తమ అభ్యర్థులను గెలుచుకోవాలి. అయితే కాంగ్రెస్లో టిక్కెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలోనే నేతలు మకాం వేసి ఉన్నారు. ఇంకా అరవైకి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండటంతో ఇక్కడ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నెల 18 నుంచి బస్సు యాత్ర అని ప్రకటించారు.
ఆరు గ్యారంటీలను...
ఈ బస్సు యాత్రకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారని చెబుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పటి వరకూ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించి నెల రోజులకు పైగానే అవుతుంది. ఈ నెల రోజుల్లో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ పార్టీ అధినాయకత్వం చెప్పిన మాటను నేతలు పెడ చెవిన పెడుతున్నట్లే అనిపిస్తుంది. టిక్కెట్లపై ఉన్న శ్రద్ధ గ్యారెంటీ కార్డు ప్రచారంలో మాత్రం పెద్దగా పెట్టడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి.
పూర్తి స్థాయి ప్రచారానికి...
తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ్యానిఫేస్టోను ప్రకటించి జనంలోకి వెళుతున్నారు. వరస సభలతో హోరెత్తిస్తున్నారు. నిన్న హుస్నాబాద్ లో సభలో పాల్గొన్న కేసీఆర్ నేడు జనగామ, భువనగిరి సభల్లో పాల్గొంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఢిల్లీ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తుంది. ప్రకటించిన జాబితాలో ఉన్న నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కూడా ఇంకా పూర్తి స్థాయి ప్రచారానికి దిగలేదు. పదేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండటంతో ప్రచారాని కంటే ముందు ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో కాంగ్రెస్ అభ్యర్థులు నిమగ్నమయి ఉన్నారని చెబుతున్నారు. ఆ తర్వాతనే ప్రచారం ప్రారంభిస్తామని చెబుతున్నారు.
నమ్మకం కలిగిస్తారా?
ఇదిలా ఉండగా ఒకవేళ గెలిచినా పార్టీలో ఉంటారన్న గ్యారంటీ అయితే ఏంటన్న ప్రశ్న క్యాడర్ నుంచి వినిపిస్తుంది. ఎక్కువ మంది కోవర్టులను పార్టీలో చేర్చుకోవడం, వారికే టిక్కెట్లు కేటాయిస్తుండటంతో కిందిస్థాయి కార్యకర్తల్లో ఆందోళన మొదలయింది. మళ్లీ కాంగ్రెస్ కోసం చెమటోడ్చి గెలిపించినా వారు పార్టీలో ఉంటారా? లేదా? అన్న సందేహం మాత్రం అందరిలోనూ ఉంది. కోవర్టుల చేరికలతో ఈ అనుమానం మరింత బలపడిందంటున్నారు. కేసీఆర్ ఇప్పటికే రెండు సార్లు దెబ్బకొట్టినా అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమయిందని చెబుతున్నారు. అత్యధిక మెజారిటీ వస్తే తప్ప కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు పార్టీలోనే కొనసాగుతారన్న గ్యారంటీ లేదు. మంత్రి పదవి అంటే పరుగు పెట్టి ప్రగతి భవన్ చేరుకునే వారే అధికంగా ఉన్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముందు ఈ ప్రమాదం లేదని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలకు అగ్రనేతలు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది.
Next Story