Mon Dec 23 2024 07:13:45 GMT+0000 (Coordinated Universal Time)
ఉదయపూర్ తీర్మానం... ఆ ఇద్దరికీ మినహాయింపు అందుకే
కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించింది. యాభై ఐదు చోట్ల తన అభ్యర్థులను ఖరారు చేసింది
కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించింది. యాభై ఐదు చోట్ల తన అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఉదయ్‌పూర్ తీర్మానాన్ని మాత్రం కొన్ని కుటుంబాలకు మాత్రం సడలించినట్లు తెలిసింది. ఉదయ్‌పూర్ తీర్మానంలో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని కాంగ్రెస్ తీర్మానించింది. కానీ కొన్ని సమయాల్లో మినహాయింపులు ఉంటాయని ఈ తొలి జాబితాను చూస్తే అర్థమవుతుంది. కేవలం గెలుపు గుర్రాలకే తాము టిక్కెట్లు ఇస్తున్నందున కొందరికి మినహాయింపులుంటాయని తొలి నుంచి వేస్తున్న అంచనా నిజమైంది.
నల్లగొండలో...
నల్లగొండ జిల్లాలో మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రెండు సీట్లను కేటాయించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ ను కేటాయించింది. ఆయన సతీమణి పద్మావతికి కోదాడ సీటును ఖరారు చేసింది. గత ఎన్నికల్లోనూ ఇద్దరూ ఇదే స్థానాల నుంచి పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతి ఓటమి పాలు కాగా, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆయన హుజూర్ నగర్ స్థానానికి పోటీ చేసి నల్లగొండ పార్లమెంటుకు పోట ీచేసి ఎన్నికయ్యారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ హుజూర్ నగర్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి మళ్లీ రెండు సీట్లు ఆ కుటుంబానికి కేటాయించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ నుంచి...
అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి కూడా రెండు సీట్లు కేటాయించింది. ఆయనకు మల్కాజ్ గిరి స్థానం కేటాయించడంతో పాటు ఆయన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ సీటును కేటాయించింది. మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ లో రెండు సీట్లు దక్కకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు రెండు సీట్లు ఇస్తేనే పార్టీలోకి వస్తానని షరతు విధించారు. అందుకు అంగీకరించిన అధినాయకత్వం మాత్రం రెండు టిక్కెట్లను కేటాయించింది. అయతే ఒకే కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వడంపై పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా పట్టించుకున్నట్లు కనపడలేదు.
Next Story