Mon Dec 23 2024 16:15:29 GMT+0000 (Coordinated Universal Time)
మాట తప్పేదే లేదు.. అదే మా గ్యారంటీ
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎన్నిక జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎన్నిక జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగు సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సంగతి ప్రపంచమంతా తెలుసునని అన్నారు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకున్నామని, రాజకీయ లాభ,నష్టాల గురించి ఆలోచించలేదన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆయన అందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ స్కామ్ చేసి భూములన్నీ లాక్కున్నారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని మోసం చేశారని రాహుల్ అన్నారు.
అధికారంలో ఉన్న రాష్ట్రంలో...
రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పి ఎంత చేశారో చెప్పాలని ఆయన కోరారు. కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గడ్ లో ఇచ్చిన హామీలన్నీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ నెరవేర్చాయన్నారు. కావాలంటే అక్కడకు వెళ్లి కనుక్కోవచ్చన్నారు. ఛత్తీస్గడ్ లో రుణమాఫీ చేస్తామని చెప్పి చేశామని ఆయన చెప్పారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చి అధికారం చేపట్టిన మొదటి రోజునే అమలులోకి తెచ్చామని తెలిపారు. అక్కడ మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని ఆయన అన్నారు. విద్యుత్తు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తామని చెప్పారు.
జాతీయ పండగగా...
సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండగగా ప్రకటిస్తామని తెలిపారు. ఢిల్లీలో అధికారంలోకి రాగానే ఈ జాతరను జాతీయ పండగగా గుర్తిస్తామని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఎన్నిక జరుగుతుందన్నారు. బీజేపీ ఇప్పటికే ఓటమి పాలయిందన్నారు. బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటుందని రాహుల్ అన్నారు. రెండు పార్టీలూ కలసి ఉన్నాయన్నారు. వారితో ఎంఐఎం కలసి పనిచేస్తుందన్నారు. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. బీజేపీకి అన్నివిధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ఈ మూడు పార్టీలు కలసి కాంగ్రెస్ ను ఓడించేందుకు మీ ముందుకు వస్తున్నాయని తెలిపారు.
కేసీఆర్ పై మాత్రం...
ముఖ్యమంత్రి అవినీతిపై ఏ ఐటీ దాడులు జరగవని, సీబీఐ కేసులుండవని అన్నారు. విపక్ష నేతలపై మాత్రం అన్ని కేసులు పెడతారన్నారు. చివరకు తన పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, కానీ కేసీఆర్ పై ఒక్క కేసు కూడా ఉండదన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. తమను నమ్మి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. కాగా కాంగ్రెస్ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
Next Story