Thu Dec 19 2024 09:46:18 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : సరైన సమయంలో సరైన నిర్ణయం... సాహసం చేసి ఉంటే?
వైఎస్ షర్మిల నిర్ణయం సరైనదేనని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ కు మద్దతివ్వడం కరెక్టేనని అంటున్నారు.
అవును వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆమె చెబుతున్న కారణాలు ఏవైనా ఇప్పుడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల పోటీ చేయకపోవడమే మంచింది. ఒకరకంగా తన సోదరుడు జగన్ కు కూడా మేలు చేసినట్లే. ఇప్పుడు తెలంగాణలో స్ట్రయిట్ ఫైట్ మాత్రమే ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు ఉంది. మరో పార్టీకి అవకాశం లేదు. బీజేపీ తాము ఉన్నామంటూ ఉన్న కనీస స్థానాలకే పరిమితమవుతుంది. అదే వైఎస్సార్టీపీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపు కూడా కష్టమే.
భిన్నమైన ఎన్నికలు...
ఈ ఎన్నికలు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అధికార పార్టీపై వచ్చిన వ్యతిరేకత కావచ్చు. తొమ్మిదేళ్ల పాలన చూసి విసుగు చెంది ఉండవచ్చు. ఒకింత కాంగ్రెస్ కు కూడా గెలుపు అవకాశాలున్నాయంటున్నారు. చివరకు కాంగ్రెస్ గెలుస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ కు మాత్రం గట్టి పోటీ ఇస్తుందన్నది మాత్రం వాస్తవం. 119 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతుంది. కాంగ్రెస్ కూడా ఈ సారి సర్వేలు చేయించి మరీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆచితూచి అభ్యర్థులను బరిలోకి దించింది. వైఎస్ షర్మిల కూడా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసింది. పాలేరులో ముగించాలనుకున్నా కుదరలేదు కానీ, ఆమె ప్రభావం చూపే నేతగానే చూడాలి.
నష్టమే తప్ప...
ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ పోటీ చేయడం వల్ల ఆ పార్టీకి నష్టమే కాని పెద్దగా ప్రయోజనం ఉండదు. కేవలం షర్మిల పోటీ చేసే స్థానంలో గెలవచ్చు. అదీ వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తే అదీ చెప్పలేని పరిస్థితి. పాలేరు నియోజకవర్గంలో హేమాహేమీలు తలపడుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి, మరొక వైపు బలమైన నేతగా కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరిని తట్టుకుని గెలవడం అంత ఆషామాషీ కాదు. అందుకే హుందాగా వైఎస్ షర్మిల బరి నుంచి తప్పుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
హుందాగా...
వైఎస్ అభిమానులతో పాటు రెడ్డి సామాజికవర్గం కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పోటీకి దిగి సాహసం చేయడం తప్ప మరొకటి కాదు. అయితే బేషరతుగా మద్దతిస్తున్నామని ప్రకటించడం కూడా ఒకరకంగా షర్మిలకు హుందాతనాన్ని తెచ్చి పెట్టే విధంగా ఉంది. పదవుల కోసం కాకుండా కేవలం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నానని ప్రకటించి షర్మిల ఎన్నికల బరి నుంచి తప్పుకోవడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. దీంతో పాటు జగన్ కు కూడా కొంత కలసి వచ్చే అంశమే. ఏపీ ఎన్నికలకు ముందు తెలంగాణ షర్మిల ఓటమి పాలయితే అది కొంత ప్రభావం చూపుతుందని కూడా పలువురు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతివ్వడం కొంత నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మొత్తం మీద వైఎస్ షర్మిల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని మాత్రం చెప్పాలి.
Next Story