Wed Nov 20 2024 13:31:30 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ పార్టీకి దూరమయ్యారా...? లేక పక్కన పెట్టేశారా?
మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన పేరు వినిపించడం లేదు
కొందరు నేతలు అలా వచ్చి ఇలా కనిపించి వెళుతుంటారు. రాజకీయంగా కనుమరుగై పోతుంటారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఇప్పుడు ఎన్నికలకు కీలక సమయంలో పెద్దగా కనిపించడం లేదు. అదీ అధికార బీఆర్ఎస్ పార్టీలో వారి ఊసే లేకుండా పోతుంది. వారంతట వారే కనుమరుగై పోతున్నారు. అలాంటి వారిలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ ఒకరు. ఆయన మునుగోడు ఉప ఎన్నికకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత ఇక కనిపించడం మానేశారు. కనీసం ఆయన ఊసు కూడా ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న స్వామి గౌడ్ ఎన్నికల సమయంలోనూ కనిపించకపోవడంపై పార్టీలోనే కాదు.. ఉద్యోగ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
ఉద్యమ సమయంలో...
స్వామి గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక ఊపు మీద ఉన్నాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీఎన్జీవో అధ్యక్షుడుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా కూడా స్వామి గౌడ్ పనిచేశారు. అనంతరం అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. అప్పటి పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా కనిపించారు. ఏ ఫ్రేములోనైనా ఆయనే దర్శనమిచ్చే వారు. 2014 ఎన్నికల తర్వాత అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ స్వామి గౌడ్ ను ఎమ్మెల్సీని చేశారు. అంతటితో ఆగకుండా శాసనమండలి అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.
ఇద్దరి మధ్య...
ప్రస్తుత మంత్రి శ్రీనివాసగౌడ్ సహచరుడిగా ఉన్న స్వామి గౌడ్ కు కేబినెట్ లభించింది. స్వామిగౌడ్ కు కేబినెట్ ర్యాంకు పదవి ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మాత్రమే. అయితే ఆ తర్వాత శ్రీనివాసగౌడ్ కు లభించిన ప్రయారిటీ స్వామిగౌడ్ కు దక్కలేదంటారు. అంతే మండలి అధ్యక్ష పదవి పూర్తయిన తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. అధినాయకత్వం ఆగ్రహానికి గురయ్యారంటారు. కారణమేంటో తెలియదు కానీ ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. కొన్నాళ్లు బీజేపీలో కొనసాగిన ఆయన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరిగి గులాబీ కండువాను కప్పుకున్నున్నారు. గత ఏడాది అక్టోబరు 21న ఆయన మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరారు. ఆయనతో పాటు చేరిన దాసోజు శ్రావణ్‌కు ఇటీవల మంత్రివర్గం ఎమ్మెల్సీగా సిఫార్సు చేసింది. కానీ స్వామి గౌడ్ పేరు మాత్రం కనిపించలేదు.
అటెండర్ స్థాయి నుంచి...
అటెండర్ స్ధాయి నుంచి మండలి ఛైర్మన్ గా ఎదిగిన స్వామి గౌడ్ ఎన్నికల నగారా మోగినా ఆయన ఎక్కడా కనపడక పోవడం చర్చనీయాంశంగా మారింది. మరోసారి అధికారంలోకి వస్తే ఏదైనా పదవి వస్తుందేమోనని ఆయన ఆశ పెట్టుకున్నారను కోవాలా? లేదా తనను పట్టించుకోని బీఆర్ఎస్ పార్టీపై మరోసారి అలిగారా? అన్నది మాత్రం తెలియరావడం లేదు. ఎన్నికల సమయంలో కుల నేతలకు పెద్ద డిమాండ్ ఉంటుంది. కానీ ఈ తరుణంలోనూ స్వామి గౌడ్ కనిపించకపోవడం వెనక ఏం జరిగి ఉంటుందా? అన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద స్వామి గౌడ్ రాజకీయాల నుంచి దూరమయ్యారా? లేక ఆయనను మరోసారి పార్టీ పక్కన పెట్టిందా? అన్నది తెలియాలంటే ఆయన నోటి నుంచి విషయం బయటకు రావాల్సిందే.
Next Story