Fri Dec 20 2024 05:46:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : గెలుపెవరిదో ఇట్టే చెప్పేయొచ్చు.. ఈసారి విజయం మాత్రం?
తెలంగాణలో సాధారణ ఎన్నిలకు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఎవరి అంచనాల్లో వారున్నారు
తెలంగాణలో సాధారణ ఎన్నిలకు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఈసారి వేవ్ ఎవరి వైపు ఉంది? తెలంగాణ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? అన్న ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే ఉంటుంది. సైలెంట్ వేవ్ ఉందని కొందరు.. ఆ పార్టీకే అనుకూలంగా ఉంటుందని మరికొందరు ఇలా అందరూ ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. అయితే డిసెంబరు 3వ తేదీన ఫలితాలు వెలువడనుండటంతో అప్పటి వరకూ ఈ టెన్షన్ తప్పదు. ఎవరి లెక్కలు వారివి. ఎవరి ధీమా వారిది. ఎవరి అంచనాలు వారివి. కానీ సాధారణ ఎన్నికల్లో లెక్కలన్నీ తలకిందులవుతాయి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. జనం మూడ్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే.
ఐదు స్థానాల్లో ఉప ఎన్నికలు...
అయితే గత ఐదేళ్లలో జరిగిన ఉప ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే అధికార బీఆర్ఎస్ కు ఏమంత సానుకూలత లేదని విపక్షాలు అంటుండగా, అదేమీ కాదని, ఉప ఎన్నికల్లో వేర్వేరు కారణాలు చూస్తారని అధికార పార్టీ నేతలు తమకు తాము నచ్చ చెప్పుకుంటున్నారు. 2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో ఐదు నియోజవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్ నగర్, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, మునుగోడులలో వేర్వేరు కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, రెండు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక ఉప ఎన్నికలోనూ గెలవలేదు.
రాజీనామాల కారణంతో...
హుజూర్ నగర్ ఎన్నిక ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా నల్లగొండ ఎంపీగా గెలవడంతో ఆయన హూజూర్నగర్ కు రాజీనామా చేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిపై బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక దుబ్బాక నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఈ ఎన్నిక జరిగింది. కానీ బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలిచారు. కేవలం వెయ్యి ఓట్లతేడాతోనే ఆయన విక్టరీని కొట్టేశారు.
సిట్టింగ్ స్థానాలు కోల్పోయి...
అలాగే నాగార్జున్ సాగర్ లో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ సీనియర్ నేత కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ నోముల నరసింహయ్య కుమారుడు భరత్ ను రంగంలోకి దించింది. చివరకు భరత్ భారీ విజయంతో గెలుపు బాట పట్టారు. కాంగ్రెస్ ఇక్కడ రెండో స్థానానికి పరిమితమయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అప్పటి మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు ఆయన బీజేపీలో చేరుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈటలను ఓడించాలని భారీగా నగదును ఖర్చు చేసినా చివరకు విజయం ఈటలదే అయింది. ఇక మునుగోడు నియోజకవర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో అధికార బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ కు ఇక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ జరిగింది.
కానీ ఈసారి...
ఈ ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలను పరిశీలిస్తే ఆ ఐదుచోట్ల ఇప్పుడు గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠ సహజంగానే ఉంటుంది. కానీ ఈ ఐదు స్థానాల్లో మళ్లీ దాదాపు గెలిచిన అభ్యర్థులే బరిలో ఉన్నారు. నాగార్జున సాగర్, మునుగోడు, హుజూర్ నగర్ లలో ఈసారి కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయంటున్నారు. దుబ్బాకలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య విజయ దోబూచులాడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ లోనూ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఉప ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఈసారి ఏ పార్టీకి రాకపోవచ్చు. ఉప ఎన్నికల్లో ఒక్క సీటునూ దక్కించుకోని కాంగ్రెస్ కు మాత్రం ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది డిసెంబరు 3వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Next Story