Sun Nov 17 2024 23:36:37 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ ను భయపెడుతున్న గల్ఫ్ బలగం
నవంబర్ 20న కోరుట్లలో గల్ఫ్ జేఏసి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ అనంతరం వందలాది కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అందులో ఐదుగురి అభ్యర్థుల్లో నలుగురు మాట్లాడారు. వారి మాటల్లో ఆవేశం, కసి కాకుండా స్థిరత్వం కనిపించింది. రాజకీయంగా నిశితం అవుతున్న బృందంగానే కాదు, అదొక బలగంగా మారుతున్న వైనం కానవచ్చింది.
నవంబర్ 20న కోరుట్లలో గల్ఫ్ జేఏసి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ అనంతరం వందలాది కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అందులో ఐదుగురి అభ్యర్థుల్లో నలుగురు మాట్లాడారు. వారి మాటల్లో ఆవేశం, కసి కాకుండా స్థిరత్వం కనిపించింది. రాజకీయంగా నిశితం అవుతున్న బృందంగానే కాదు, అదొక బలగంగా మారుతున్న వైనం కానవచ్చింది.
వార్త పత్రికలూ ఇంకా చదువుతున్న వారు, డిజిటల్ పత్రికలను స్మార్ట్ ఫోన్లో ఫాలో అవుతున్న వారు, అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వాళ్ళే గాక ప్రత్యక్షంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారానికి వస్తోన్న ‘గల్ఫ్’ చైతన్య రథాలను గమానిస్తూ ఉన్నవారు, బహుశా ఒక కొత్త ధోరణిని పరిశీలించే ఉంటారు. లేకపోతే ఈ కథనం కొంచెం ఆ దిశలో ఏమి జరుగుతున్నదో తెలుపుతుంది.
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి గానూ మొట్ట మొదటిసారిగా ఒక ఐదుగురు ఈ సారి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి శాసన సభకు పోటీ పడుతున్న వైనం నేటి ఎన్నికల సమరంలో ఒక భిన్నమైన పార్శ్వం. దాని గురించి చెప్పాలంటే – ఇక్కడ ఆ ఐదుగురు గురించే కాదు, మరో ముగ్గురు కేసీఆర్, కేటీఆర్ గురించి కూడా కొంచెం చెప్పుకుంటే గానీ అసలు నేపథ్యం బోధపడదు.
గల్ఫ్ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న వీరు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మీరు వింటున్నారో లేదోగానీ వారు మనుషులుగా తమను పట్టించుకోని స్థితి నుంచి కనీసం ఓటర్లుగా చూసైనా గౌరవించాలన్న దిశలో తమ సరికొత్త ఆచరణ, ఒక స్వతంత్ర రాజకీయ వాతావరణం కోసం వారు కష్టం, ఆ వివరాలు అర్థమయ్యేలా చెప్పడానికి ముందు ఒక ముగ్గురి గురించి చెప్పుకుందాం. అందులో ప్రథమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే చెప్పుకోవాలి.
అది 2008. కోరుట్ల సమీపంలోని మొగలిపేట గ్రామం. ఇద్దరు సోదరులు దుబాయ్ లో సిలిండర్ పేలి చనిపోవడంతో అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ ఎంతో ఆవేదన చెంది సరాసరి వారి కుటుంబాన్ని సందర్శించి ఓదార్చారు. ఆ ఒక్క కుటుంబాన్నే కాదు, లక్షలాది కుటుంబాలకు ఓదార్పుగా, ఉపశమనంగా గొప్ప భరోసా నిచ్చే ఓ మహత్తర నినాదాన్ని కూడా అందించి మూడు శ్రేణుల ప్రజలనూ ఉద్యమంలో కదిలి వచ్చేలా చేశారు. అదే, "బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి" జీవితాల గురించిన నినాదం.వాస్తవానికి ఆ నినాదం ఒక పిహెచ్డి థీసిస్ తాలూకు వర్క్ అని, అది జమ్మికుంటలో ఉండే పుల్లూరి సంపత్ రావు పరిశోధనా అంశం అని కేసీఆర్ ఎన్నడూ చెప్పలేదు గానీ ఆ నినాదం తెలంగాణలో దుర్భర జీవితాల వర్తమానం గురించి, ఆ పరిస్థితులు మారాలన్న ఆకాంక్షల గురించి మూడు ముక్కల్లో ఎంతో బలంగా చాటింది.
ఉద్యమంలో వీరిని పెద్ద ఎత్తున పాల్గొనేలా చేసింది కూడా. మరి, ఆ నినాదం అందించిన కేసీఆర్ ఆ రోజు ఏమన్నరూ అంటే, దుబాయ్ బత్కపోయిన వారు ఏ కారణంగా చనిపోయినా - ఇస్తున్న లక్ష రూపాయల నష్టపరిహారం దేనికి సరిపోతుంది? అని హూంకరించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కనీసం ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. మన ప్రభుత్వమే వస్తే ఐదు లక్షలతో పాటు ఐదువందల కోట్ల రూపాయలతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకుంటామని కూడా వారు చెప్పారు. అది 2008 నాటి మాట. సరిగ్గా పదిహేనేళ్ళ తర్వాత - స్వరాష్ట్రం వచ్చి పదేళ్ళు గడుస్తున్నప్పటికీ ఆ దిశలో కొత్తగా ఏమీ జరగలేదు. వచ్చే లక్ష రూపాయలు కూడా పోయాయనే చెప్పాలి. నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి.
రెండవ దఫా కూడా ఆయనే మలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ, వారి చేతికి అధికారం ఇచ్చినప్పటికీ తాను హామీ ఇచ్చిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఏమైందీ అంటే ఇదిగో వాళ్ళ మానాన వారి బ్రతకడం, చావడం తప్ప మరేమీ జరగలేదు.
ఎడారి జీవితలుగా చెప్పుకునే అక్కడి గల్ఫ్ కార్మికులు ఎన్నో రకాల పనిపరిస్తితులు, ఏజెంట్ల మోసాలు, ఇతరత్రా బాధలు, తద్వారా ఆత్మహత్యలు, హత్యలకు గురికావడం, హృద్రోగంతో చనిపోవడాలు, చనిపోతే వారి డేడ్ బాడీలను తేవడం, ఈ పదేళ్ళలోనే రెండువేలా నలభై ఆరు మంది శవాలు తెలంగాణాకు చేరుకున్నాయంటే, వారి కుటుంబాలకు అంత్య క్రియలు చేశాయంటే తలా ఇంత చందా వేసుకున్న వాలంటరీ యాక్టివిజమే తప్పా మనం చెప్పుకుంటున్న ఐదుగురు వ్యక్తులు, ఇతర సంస్థల చొరవ తప్పా ప్రభుత్వం చేసింది నామ మాత్రమె అంటే విచారం కలుగుతుంది.
ఈ కథనంలో పేర్కొంటున్న ముగ్గురిలో రెండోవ్యక్తి కేటిఆర్ గురించి చెప్పాలి. అది 2016, మంత్రి హోదాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలతో విశాల సమావేశం ఏర్పాటు చేసి ప్రవాస భారతీయులకు తగిన పాలసీ రూపొందిస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ పాలసీ, అదే - ఆ విధాన రూపకల్పనలో గల్ఫ్ బాధితుల సంక్షేమం తప్పకుండా ఒక ముఖ్య భాగంగా ఉంటుందని కూడా చెప్పారు. ఆ సమావేశం జరిగి ఏడేళ్ళు అయింది. ఇప్పటికీ వారు ఇచ్చిన హామీ నేరవేర్చలేదు.
చిత్రమేమిటంటే, ప్రతి నెలా వేయి కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం మినిమం ఏడాదికి ఐదు వందల కోట్ల మూలధనంతో వెల్ఫేర్ బోర్డ్ పెట్టాలన్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. పోనీ ఆ డిమాండ్ కూడా చేసింది కేసీఆరే. అదీ పరిస్థితి. ఐతే, ఈ పదేళ్ళ పాలనలో చేయలేదుగానీ మొన్న పది రోజుల క్రితం, ఎన్నికల సమయంలో, పరిస్థితి శృతి మించుతుందన్న ఆందోళనతో డిచ్ పల్లి సభలో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుదారులకు ఏర్పాటు చేయబోయే బీమా పథకాన్ని గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తామని అన్నారు. అంతే తప్పా ప్రభుత్వంలో తండ్రి తర్వాత అంతే కీలకంగా ఉన్న కుమారుడుగా కేటిఆర్ గల్ఫ్ కార్మికుల కోసం చేసింది ఏమిటీ అంటే ఏమీలేదనే చెప్పాలి.
ఇక మూడవ వ్యక్తి కవితమ్మ 2021లో వలస కార్మికుల కేంద్రంగా ఉన్న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ఒక ఆత్మగౌరవ ప్రతీకగా అంతెత్తున ఒక మహోన్నత డిజిటల్ జాతీయ జెండా మాదిరి ఆవిష్కరించారు. అదీ సుమారు కోటి రూపాయలు ఖర్చుపెట్టి. కానీ వారు కూడా ఈ పదేళ్ళలో చేసిందేమీ లేదు. గల్ఫ్ కార్మికుల స్థావరంలో తన ఆటపాటా తప్ప ఈ బ్రతుకులను ఆదుకునే స్థిరమైన విధానం పట్ల శ్రద్ధాసక్తులు, బాధ్యతా లేకపోవడం విచారకరం. నిజానికి బ్రతుకు పండుగ – బతుకమ్మ, జీవితాలను అందంగా పేర్చుకునే ఒరవడి దానిది. అటువంటిది ఆ పండుగను జీవితాలను మార్చేందుకు కాకుండా ఆ పండుగను ఆశ్రయించి ఒక వినోదం, విహారాలకు వేదికగా చేసుకోవడం విషాదం.
చూడగా చూడగా దీన్ని కుటుంబ పాలన అనకుండా ఇంకా ఏమంటాం గానీ, ఇలా ఈ కల్వకుంట్ల కుటుంబంలో అత్యంత కీలకమైన ఈ ముగ్గురూ మాట తప్పిన ఫలితమే లేదా మనందరం పోరాడి సాధించుకున్న పదేళ్ళ స్వపరిపాలన ఆచరణలో సఫలం కాకపోవడం కారణంగానే గల్ఫ్ సంక్షేమం- అభివృద్ధి మొదటిసారిగా ఒక రాజకీయ అంశంగా మారిందని చెప్పవచ్చు. నిలబడవలసిన వారు నిలబడక పోవడంతో వివిధ ప్రాంతాల్లో ఉండే పదిహేను లక్షల మంది కార్మికులు, మరో పదిహేను లక్షల మంది రిటర్న్ వచ్చిన కార్మికుల తరపు నుంచి ఎవరూ ఊహించని విధంగా ఒక ఐదుగురు వ్యక్తులు సరికొత్తగా అవతరించడం నిజంగానే విశేషం.
అవును. ఆ ఐదుగురు- గల్ఫ్ కార్మికులు అత్యధికంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఐదు శాసన సభా స్థానాలను ఎన్నుకుని పోటీ చేస్తున్నారు. వారు నిన్నటిదాకా ఏమైనా చేయండని కలబడ్డారు. ఈ సారి తామే నిలబడ్డారు. అదే మార్పు. ఆ ఐదుగురిలో ఒకరు దొనికెని కృష్ణ. వీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా టివి రిమోట్ గుర్తుతో కేటిఆర్ పైనే నిలబడగా మరో నలుగురు సింహం గుర్తుతో ఇతర నియోజక వర్గాల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
ఆ నలుగురిలో గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవి గౌడ్ వేములవాడ నియోజకవర్గం నుంచి, గల్ఫ్ కార్మికులకు మద్దతుతో పోటీ చేస్తున్న చెరుకు రైతులు, బీడీ కార్మిక పోరాట నేత చెన్నమనేని శ్రీనివాస్ రావు కోరుట్ల నుంచి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల నిర్మల్ నుంచి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంత ధర్మపురి నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి వీరంతా ఎప్పటికప్పుడు గల్ఫ్ కార్మిక కుటుంబాలకు తలలో నాలికలా వారిని ఆర్థికంగా కూడా ఆదుకుంటూ వస్తున్న వాళ్ళు.
ఇప్పటిదాకా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వీరంతా, సంస్థలుగా పనిచేస్తున్న వారూ ఏడాదిగా ఆర్గనైజ్ అయి తమలో తాము మాట్లడుకుని భేదాభిప్రాయాలను వదిలిపెట్టి ఉమ్మడి లక్ష్యం కోసం ఒకటయ్యారు. చిత్రమేమిటంటే, వీరి లక్ష్యం వీలయితే గెలుపు, లేదంటే ఓడించడం. అవును. గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని అభివృద్దిని పట్టించుకున్నామని చెప్పి, వివిధ హామీలు ఇచ్చి మానసికంగా ఓడించిన నేతలను తాము ఓటర్లుగా మార్గం తోనే నైతికంగా ఓడించినట్లు వీరు భావిస్తున్నారు. వీలుంటే ఆ అభ్యర్థులను ఓడించాలని. ఎంతో కొంత వారిని ఓట్లతో సాధించాలని భావిస్తున్నారు. ఓటర్లుగా తాము కూడా గల్ఫ్ పేరిట సమీకృతమై ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని, రేపు ఎన్నికల అనంతరం ఆయా ప్రధాన పార్టీలు తమ గెలుపోటములను భేరీజు వేసుకున్నప్పుడు ఆ లెక్కల్లో తామ పోటీ పడటం కూడా ప్రాధాన్యత వహించే అంశంగా మార్చాలని -ఇలా తాము ఒటుబ్యాంకుగా మారడం వల్ల తమ డిమాండ్లను ఆయా రాజకీయ పార్టీలు పట్టించుకునేలా చేయాలన్నది వీరి వ్యూహం. ముందు చెప్పినట్లు ఇలా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఆ ముగ్గురు లేదా వారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం.
నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ -మొదటిసారి స్వరాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు గల్ఫ్ అంశాన్ని కనీసం మ్యానిఫెస్టోలో నైనా పెట్టింది. ఆ తర్వాత రెండు దఫాలే కాదు, ఈ సారి కూడా ఈ అంశం వారికి ఎంతమాత్రం ప్రయారిటీ కాకపోగా అసలు అదొక సమస్యగా భావించక పోవడం గల్ఫ్ కార్మికులను తీవ్రంగా బాధించింది. ఆ బాధ ఆగ్రహంగా మారిన ఫలితమే వారు ఎన్నికలలోకి దిగి పోటీ చేయడం. ఐతే, ఇందులో వారు ఓడిపోతారని తెలుసు. కానీ ప్రయత్నమే తమ గెలుపు అన్న ధీమా వారిని ఉత్సాహంగా ప్రచారం చేయడానికి పురికొల్పడం విశేషం.
దాదాపు రెండు దశాబ్దాలుగా గల్ఫ్ బాధితుల కోసం కృషి చేస్తున్న మంద భీంరెడ్డి, అలాగే ఎంతోకాలం అక్కడ తెలంగాణా జాగృతి బాధ్యులుగా ఉండి తమ సమస్యలకు పరిష్కారం లభించని కారణంగా ఆ విభాగానికి దూరమై స్వతంత్రంగా ఉంటున్నకిరణ్ కుమార్ పీచర, ఇంకా మరికొన్ని సంస్థలు, వ్యక్తులు, అందరూ కలిసి చేసిన ఎక్సర్ సైజ్ ఫలించి గల్ఫ్ జేఏసి ఏర్పడింది. దాని ఆధ్వ్యరంలో జరిగిన సమావేశాల ఫలితంగా ఈ ఐదుగురు మొదటిసారిగా ఎన్నికల రంగంలోకి దిగడం, ప్రచార రథాలతో ఆయా నియోజక వర్గాల్లో కానరావడం మనం చూస్తున్నాం.
విచారకరమైనది ఏమిటంటే, బిఆర్ఎస్ తమ మ్యానిఫెస్టోలో ఈ సారి గల్ఫ్ కార్మికుల గురించి ఒక్క మాటా కూడా మాట్లాడకపోవడం. ఆ పార్టీ వైఖరి పూర్తిగా గల్ఫ్ బాదితులకు ఏ విధంగానూ ప్రయోజనకరంగా లేకపోవడం. కాకపోతే, గల్ఫ్ జేఏసీ సుదీర్ఘ కార్యాచరణ ఫలితంగా, వారు ఎన్నికల్లో దిగిన కారణంగానూ కొంత సానుకూల ప్రభావం ఏర్పడి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ సమస్యల పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేస్తామని ఎట్టకేలకు ముందుకు వచ్చింది. ఆ వివరాలను మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అంతకన్నా బాగా బీజేపీ కూడా తమ మ్యానిఫెస్టోలో రాసింది. ఐతే, ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ తామిచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయలేకపాయినట్లే రేపు రేపు.. కాంగ్రెస్ గానీ లేదా బిజెపి పార్టీ గానీ అధికారంలోకి వచ్చికూడా మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయకపోతే పరిస్థితి ఏమిటీ అన్న ఆలోచనతోనే తామే స్వతంత్రంగా ఒక స్థిరమైన ఓటు బ్యాంకుగా మారాలన్న సంకల్పానికి వచారు. ఆ మాటే సిరిసిల్ల అభ్యర్థి దొనికెని కృష్ణ, వేములవాడ అభ్యర్థి గుగ్గిల్ల రవి గౌడ్ అన్నారు. వీరంతా నిన్న కోరుట్ల సభలో కలిసి ఇక్కడి అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస రావును గెలిపించమని కార్మికులను కోరారు. తాము ఎందుకు ఎన్నికల క్షేత్రంలోకి వచ్చిందీ వివరించారు.
నిజానికి తాము పోటీ చేయడానికి ఎన్నో అంశాలను భేరీజు వేసుకున్నామని చెబుతూ సుమారు పదిహేను లక్షల మంది గల్ఫ్ లో ఉన్నారు. వారు తమ కుటుంబంలోని ముగ్గురి ఓటర్లకు చెప్పి నిలబడ్డ గల్ఫ్ అభ్యర్థులకు ఓటు వేపించినా దాదాపు నలబై లక్షల ఓట్లు. వీరితో పాటు రిటర్న్ వచ్చిన వారి ఓట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ అభ్యర్థులు ఎక్కడికక్కడ ముందుకు వెళుతున్నారు అని అభ్యర్థులందరికీ మార్గదర్శకత్వం వహిస్తున్న మంద భీంరెడ్డి అన్నారు.
నిజానికి గల్ఫ్ కార్మికులు ఎన్ని బాధల్లో ఉన్నారో అర్థం కాకుండా లేదంటే వారిని శ్రద్దగా వినకుండా తాము అనివార్యంగా ఈ ధోరణి చేపట్టడం అంత త్వరగా బోధపడదు. కాబట్టి వారి పరిస్థితులపై మరిన్ని వ్యాసాలను అందిస్తాను. మొత్తానికి గల్ఫ్ బలగం ఒకటి మెల్లగా ఎడారిలో ఒయాసిస్సులా ఆశావాహ మార్పుకు నడుం కట్టింది. పదేళ్ళ తెలంగాణా రాష్ట్ర వైఫల్యం నుంచి రూపొందుతున్న సరికొత్త రాజకీయ ధోరణిగానే దీన్ని చూడాలని, అందుకే ఆ ముగ్గురి వల్లే ఈ ఐదుగురి అవతరణ అని ప్రతీకాత్మకంగా రాయడం.
(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)
Next Story