Mon Dec 23 2024 07:20:30 GMT+0000 (Coordinated Universal Time)
Congress : గట్టిగా వినిపిస్తున్న పేర్లివే... కర్ణాటక ఫార్ములా ఇక్కడ కూడా అమలయ్యేనా?
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అందరూ సీఎంలే. సీనియర్లు.. జూనియర్లు అనే తేడా ఉండదు. తమకేమి తక్కువ అన్న రీతిలో ప్రతి ఒక్క నేత తనకు తాను ఫీలవుతుంటారు. జాతీయ పార్టీ కావడంతో ఆశలు ఎక్కువ మందిలో ఉండటం సహజమే. దానిని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే హైకమాండ్ తుది నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అయితే ముందు గెలవాలి. అందులోనూ గెలుపు అంటే అరకొరగా కాదు.. పూర్తి స్థాయి మెజారిటీ లభిస్తేనే ముఖ్యమంత్రి అభ్యర్థి నిర్ణయంపై హైకమాండ్ కూడా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి నిర్ణయం తీసుకుంటుంది. బొటాబొటిగా వస్తే మాత్రం నాన్చడం గ్యారంటీ.
అనుకూల పరిస్థితులు....
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు కొంత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడు విడతల జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. పెద్దగా అసంతృప్తులు లేకుండానే మొదటి అంకం ముగిసింది. అలాగే ప్రచారంలోనూ పార్టీ బాగానే ఉంది. ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి బలంగానే వెళ్లాయి. ప్రధానంగా మహిళలు, యువత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో పాటు రాహుల్, ప్రియాంకగాంధీలు కూడా దాదాపు పథ్నాలుగు రోజులు ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారం చేయనుండటంతో కాంగ్రెస్ విజయావకాశాలను కొట్టిపారేయలేం. అలాగని బీఆర్ఎస్ ను తోసిరాజని గెలుస్తుందని అనుకోలేం. ఒక్క శాతం ఓట్లు కూడా ఎన్నో సీట్ల ఫేట్ ను మారుస్తాయి కాబట్టి చివర వరకూ ఎవరిదన్న విజయం చెప్పలేని పరిస్థితి తెలంగాణలో ప్రస్తుతం నెలకొని ఉంది.
రేసులో ముందంజ...
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్న దానిపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాల నేతలకే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం రేసులో ముందుంటారు. రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ పుంజుకుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. అయితే పార్టీలోనే రేవంత్ కు శత్రువులు ఎక్కువ. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ పీసీసీ చీఫ్ అవ్వడమే చాలా మందికి ఇష్టం లేదు. కానీ హైకమాండ్ కఠిన నిర్ణయంతో దానిని ఎవరూ ఆపలేకపోయారు. రేవంత్ ధీటుగా కేసీఆర్ ను ఎదుర్కొనగలరన్న నమ్మకంతోనే ఆయనకు హైకమాండ్ ఆ పదవిని కట్టబెట్టింది. దీంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి.
మేము సయితం అంటూ...
ఇక రేవంత్ తో పాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరు కూడా పార్టీలో సీనియర్లు కావడంతో వారికి దక్కే అవకాశాలను కొట్టి పారేయలేం. అయితే ఇందులో అందరితో కలసి మెలసి వివాదరహితుడిగా ఉన్న నేత జానారెడ్డి మాత్రమే. పైగా సుదీర్ఘకాలం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆయన అయితే నేతల నుంచి కూడా అభ్యంతరాలు వెలువడవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాన్ కాంట్రవర్సీ. ఆయన గతంలో రెండుమార్లు పీసీసీ చీఫ్ గా పనిచేశారు. గాంధీ కుటుంబంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను సయితం సీఎం రేసులో ఉన్నానంటున్నారు. ఆయన కూడా సీనియర్ నేత కావడం.. కాంగ్రెస్ నే నమ్ముకుని ఉండటం ప్లస్ పాయింట్. అయితే కొంత దూకుడు స్వభావం ఆయనకు మైనస్ అవుతుందని చెబుతున్నారు. ఎక్కువ మంది ఆయన పేరును వ్యతిరేకించే అవకాశముంది.
ఎస్సీలకు ఇవ్వదలచుకుంటే...
ఇక ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలనుకుంటే ముందు వరసలో మల్లు భట్టి విక్రమార్క ఉంటారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. మల్లు భట్టి విక్రమార్క పార్టీకి అత్యంత నమ్మకస్థుడు. ఆయన ప్రస్తుతం సీఎల్పీ నాయకుడిగా కూడా ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న నేత కావడతో మల్లు పేరు గట్టిగా వినిపిస్తుంది. పార్టీ కోసం ఆయన పదమూడు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్రను కూడా చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇక దామోదర రాజనర్సింహ పేరు కూడా ఎటూ ఉంటుంది. సీనియర్ నేత కావడం, గతంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటివి ఆయనకు కలసి వచ్చే అంశాలుగా చూడాలి.
వీళ్ల పేర్లు కూడా...
ఇది అదీ కాదనుకుంటే సీతక్క కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సీతక్క మావోయిస్టుగా ఉండి ప్రజాసేవలోకి వచ్చారు. ఆమె పేరు కూడా ప్రముఖంగానే వినపడుతుంది. రాహుల్ గాంధీ కూడా తన భారత్ జోడో పాదయాత్రలోనూ, మొన్న ములుగు వచ్చినప్పుడు ఆమెకు ప్రత్యేకంగా గుర్తించడం వల్ల ఈ చర్చ మొదలయింది. మరోవైపు బీసీ అభ్యర్థిగా మధుయాష్కి గౌడ్ పేరు వినపడుతుంది. ఆయన ఎల్.బి. నగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరు. రెండు సార్లు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన కూడా చివరి క్షణం వరకూ తన పేరు ఖరారయ్యేందుకు కృషి చేస్తారన్నది వాస్తవం. మైనారిటీల కోటాలో షబ్బీర్ ఆలీ పేరు కూడా బాగానే వినిపిస్తుంది. ఇలా రెడ్డి, ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన నేతలు అనేక మంది పోటీలో ఉన్నారు.
కర్ణాటక ఫార్ములా అయితే...
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సీఎం ఎంపికను చూసుకుంటే పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను పక్కన పెట్టి అక్కడ బలమైన సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశమిచ్చింది. అదే ఫార్ములా ఇక్కడ కూడా పనిచేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి సీఎం రేసులో మాత్రం అనేక మంది నేతలున్నారు. కానీ అన్నింటికంటే ముందు గెలవాలి. అత్యధిక స్థానాలు సాధించాలి. అప్పుడే ఈ సందేహాలకు ఒక జవాబు దొరుకుతుంది. అప్పటి వరకూ కాంగ్రెస్ లో ఇంతే. ప్రతి ఒక్క నేత సీఎం అభ్యర్థిగానే చెలామణి అవుతుంటారు. నిర్ణయం మాత్రం హైకమాండ్ దే. ఢిల్లీ వైపు చూడాల్సిందే తప్ప ఇక్కడ నేతల ఆటలు చెల్లుబాటు కావు. వీటన్నింటినీ పక్కన పెట్టి ముందు కాంగ్రెస్ విజయానికి ఐక్యంగా కృషి చేయాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటుంది.
Next Story