Mon Dec 23 2024 00:18:35 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : ఆ బీఫారం అంత ఖరీదా... కోట్లు చెల్లించి కొనుగోలు చేశారా?
తెలంగాణ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఉత్తర భారతీయ పార్టీల బీఫారాలను కోట్లు ఇచ్చి కొనుగోలు చేశాయన్న ఆరోపణలున్నాయి
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో తొమ్మిదిరోజులు మాత్రమే పోలింగ్ కు గడువు ఉంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 28వ తేదీతో ప్రచారం ముగియనుంది. అనేక పార్టీలు తెలంగాణలో పోటీ పడుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఎస్పీ కూడా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించుకుని ప్రచారంలో ముందుకు వెళుతుంది. అయితే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులు కూడా కొందరు పోటీలో నిలుచున్నారు. ఈ పార్టీ ఇక్కడ లేకపోయినా పశ్చిమ బెంగాల్ లో కొంత ఈ పార్టీ కనపడుతుంది.
పశ్చిమ బెంగాల్ కేంద్రంగా...
సుభాష్ చంద్రబోస్ 1939లో ఏర్పాటు చేసిన ఈ ఫార్వార్డ్ బ్లాక్ అప్పట్లో దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పాటు చేసిన పార్టీ. సుభాష్ చంద్రబోస్ అనగానే గుర్తొచ్చేది స్వాతంత్ర్య సమరంలో పోరాడిన యోధుడు. అలాంటి బోస్ ఈ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీకి ఛైర్ఫర్సన్ గా నరేన్ ఛటర్జీ, కార్యదర్శిగా దేవరాజన్ లు ఉన్నారు. ఈ పార్టీ గుర్తు పులి తో పాటు కంకి కొడవలి ఉంటుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి చీలిన పార్టీగా దీనిని ప్రజలు ఉత్తర భారతంలో గుర్తిస్తారు. ఉత్తర భారతదేశంలో కొన్ని పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ అనేక చోట్ల పోటీ చేస్తుంది. అయితే గెలిచింది మాత్రం తక్కువేనని చెప్పాలి.
ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులుగా...
తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా గెలుస్తారు. గత ఎన్నికల్లో స్వతంత్ర, అభ్యర్థులతో పాటు బీఎస్పీ గుర్తు మీద పోట చేసి గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు. ప్రజలు పార్టీని కాకుండా వ్యక్తిగతంగా బలంగా ఉన్న నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతారు. తాము ఉన్న పార్టీలో టిక్కెట్ దక్కకపోవడంతో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, మరో ఐదేళ్లు వెయిట్ చేయలేక పోటీకి సై అంటారు. తెలంగాణలో ఇలా ఇతర ఉత్తర భారతీయ పార్టీల నుంచి పోటీ చేసి గెలుపొందిన వారు ఉండటంతో ఈ టిక్కెట్లకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ తెలంగాణ ఎన్నికల్లోనూ ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పలువురు పోటీ పడుతున్నారు.
కోట్లు తీసుకుని....
ఉదాహరణకు కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన ఫార్వార్డ్ బ్లాక్ బీఫారం తెచ్చుకున్నారు. అక్కడ కాంగ్రెస్ సీపీఐకి కేటాయించింది. దీంతో జలగం వెంకట్రావు కోట్లు ఖర్చు చేసి బీఫారం తెచ్చుకున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. తాను దేవరాజ్ తో మాట్లాడనని, అయినా పార్టీ నిధుల కోసం బీఫారాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారని నారాయణ తెలపడంతో ఒక్క బీఫారం ఇంత ఖర్చవుతుందా? అన్నది ప్రపంచానికి తెలిసింది
గెలిచిన తర్వాత...
ఈ తెలంగాణ ఎన్నికల్లో అనేక చోట్ల ఫార్వార్డ్ బ్లాక్ బీఫారాలు ఇచ్చి కోట్ల రూపాయల నిధులను జమ చేసుకుందని కామ్రేడ్ నారాయణ ఆరోపించారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా సరే.. గుర్తు కోసం.. ఒక పార్టీ కోసం పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఉన్న ఫార్వార్డ్ బ్లాక్ టిక్కెట్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో డిమాండ్ పెరిగిందన్నది నారాయణ ఆరోపణ. మరి నిజమెంతో తెలియదు. గుర్తు కోసం మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా కొందరు అభ్యర్థులు ఫార్వార్డ్ బ్లాక్ టిక్కెట్లను తెచ్చుకున్నారన్నది మాత్రం వాస్తవం. గెలిచిన తర్వాత మళ్లీ వీరు అధికార పార్టీలోకి వెళతారు. అది సత్యం. గతం చెప్పిన నిజం.
Next Story