Mon Dec 23 2024 10:25:07 GMT+0000 (Coordinated Universal Time)
MIM : గెలుపు ఈసారి అంత సులువు కాదట.. సీట్లు తగ్గే ఛాన్స్ ఉందంటున్నారే
ఓల్డ్ సిటీలో ఈసారి ఎంఐఎంకు అంత సానుకూల వాతావరణం లేదని, సీట్లు తగ్గే ఛాన్స్ ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి
తెలంగాణ ఎన్నికల్లో ఈసారి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారన్నది ముందుగా అంచనా వేయలేని పరిస్థితి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరా హోరీ పోరు జరగనుంది. ఎప్పుడూ ఎంఐఎంకు ఏడు స్థానాలు దాని ఖాతాలో గ్యారంటీ పడతాయి. ప్రతి ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది పతంగి పార్టీ. కానీ ఈసారి కొంత ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకట ిరెండు సీట్లలో తేడా కొట్టే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ ఎంఐఎం తన పార్టీకి చెందిన అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఓల్డ్ సిటీల్ పట్టున్న...
ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు తిరుగు లేదు. అది చెప్పిందే వేదం. చేసిందే శాసనం. కొన్నేళ్ల నుంచి తిరుగులేకుండా విజయాలను చవి చూస్తూ వస్తుంది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ల నేతృత్వంలో ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినా పాత బస్తీని మాత్రం అది వదులుకోదు. దానిపై పట్టు సడలిపోదన్న ధీమా ఆ బ్రదర్స్ ది. అక్కడ ప్రతిపక్షమే లేకపోవడంతో ప్రతి ఎన్నికల్లో కలసి వస్తుండటంతో తిరుగులేని శక్తిగా ఓల్డ్ సిటీలో గాలిపటం ఎగురుతూనే ఉంది. కానీ ఈసారి కొంత పరిస్థితిలో మార్పు కనిపిస్తుందంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ముస్లిం సామాజికవర్గంలోనే వ్యతిరేకతను ఆ పార్టీ ఎదుర్కొంటుందని చెబుతున్నారు.
ఏడు నియోజకవర్గాల్లో...
ఎంఐఎం చార్మినార్, యాకుత్‌పుర, బహుదూర్‌పుర, నాంపల్లి, మలక్‌పేట్, కార్వాన్, చాంద్రాయణగుట్టలలో మంచి పట్టుంది. గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ కలసి మెలసి నడుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం కొంత ముస్లిం సామాజికవర్గంలోనే ఇబ్బందిగా మారిందంటున్నారు. బీజేపీకి బీ టీంగా ఎంఐఎం మారిందన్న ఆరోపణలను ముస్లిం సమాజం కూడా నమ్ముతుందన్నది కొన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తున్న నివేదికలను బట్టి తెలుస్తోంది. దీంతో కొన్ని స్థానాల్లో ఎంఐఎం ఈసారి ఎన్నికల్లో ఓడిపోయే అవకాశముందని కూడా చెబుతున్నారు. దీంతో ఒవైసీ బ్రదర్స్ లో ఆందోళన మొదలయిందంటున్నారు. ముస్లిం ఓటర్లు ఈసారి కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ముస్లింలోనే వ్యతిరేకత...
కేవలం పార్టీపైనే వ్యతిరేకత కాకుండా ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉండటంతో అభ్యర్థులను మార్చాలని బ్రదర్స్ రెడీ అయినట్లు చెబుతున్నారు. అందుకే ఇంత వరకూ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటించలేదని చెబుతున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో అయితే మరీ బలహీనంగా ఉందని, చార్మినార్ లోనూ అభ్యర్థిని మార్చకపోతే ఇక అంతేనన్న సంకేతాలు వెలువడటంతో ఒవైసీ సోదరులు అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓల్డ్ సిటీలో తమ పట్టును కోల్పోకుండా ఉండేలా వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థరాత్రి సమావేశాలు నిర్వహిస్తూ ముస్లిం సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తిని పారదోలే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఓల్డ్ సిటీలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం కూడా ఎంఐఎం వెనకబడటానికి కారణంగా చెబుతున్నారు. మరి బ్రదర్స్ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story