Fri Nov 08 2024 18:01:01 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : విజయానికి "హస్తం" కారణాలివే.. వారే నమ్మలేకపోతున్నారట
తెలంగాణలో దాదాపు పదేళ్లు అధికారంలో లేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ నేతలు కూడా నమ్మలేకపోతున్నారు
తెలంగాణలో దాదాపు పదేళ్లు అధికారంలో లేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ నేతలు కూడా నమ్మలేకపోతున్నారు. అయినా నిజం. ప్రజలు ఆ పార్టీ వైపు నిలబడ్డారు. హైదరాబాద్ నగరం మాత్రం కాంగ్రెస్ నాయకత్వాన్ని తిరస్కరించినా గ్రామీణ ప్రాంతమంతా గొంతెత్తి తమకు కాంగ్రెస్ పాలన మాత్రమే కావాలని కోరుకుంది. అందుకే జిల్లాలకు జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు... దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ కాంగ్రెస్ గెలిచిదంటే వారికే నమ్మకం లేదంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ అన్ని రకాలుగా బలహీన పడిన పరిస్థితుల నుంచి కోలుకుని కేసీఆర్ ను ఎదుర్కొని... తట్టుకుని నిలబడిందంటే అది మామూలు విషయం కాదు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఐదు కారణాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
01. ఐక్యత : కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్యంగా నేతల్లో ఈసారి ఐక్యత కనిపించడం మొదటి కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలందరూ ఐక్యతను చాటారు. అప్పటి వరకూ రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన నేతలు కూడా ఎన్నికల సమయం వచ్చేసరికి కలసి నడిచారు. అందరూ సమిష్టిగా ఉన్నామన్న సంకేతాలను జనంలోకి పంపారు.
02. నాయకత్వం : కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మరో ముఖ్య కారణం నాయకత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కింది స్థాయి కార్యకర్తలు నమ్మారు. విశ్వసించారు. రేవంత్ ఉంటే తమకు భయం లేదని భావించి వారు బూత్ల వద్ద అడ్డంగా నిలుచున్నారు. అధికార పార్టీని ఎదిరించారు. బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు పోరాడారంటే అది నాయకత్వంపై నమ్మకం ఫలితమే.
03. ప్రచారం : ఈ సారి ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ విన్నూత్న తరహాలో కొనసాగించడం దానికి కలసి వచ్చింది. కేసీఆర్ ను దొరగా చిత్రీకరించడంలో సక్సెస్ అయింది. ప్రకటనలు కూడా ఆకట్టుకునేలా రూపొందించింది. మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన పనులను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపగలిగింది. రాహుల్, ప్రియాంక గాంధీ ప్రచారం అదనపు బలం అయింది.
04. గ్యారంటీలు : ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా బాగా పనిచేశాయి. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, జాబ్ క్యాలెండర్, కౌలు రైతులకూ రైతు బంధు, ఇందిరమ్మ ఇళ్లు, వంటి అంశాలు ఆ వర్గాలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు కాంగ్రెస్ వెంట నడిచేలా ఆరు గ్యారంటీలు పనిచేశాయనే చెప్పాలి.
05. అభ్యర్థుల ఎంపిక : అభ్యర్థుల ఎంపికను కూడా ఆచితూచి చేసింది. సర్వే నివేదికలను అనుసరించి నేతల సిఫార్సుల కంటే.. సీనియారిటీ కంటే.. గెలుపు గుర్రాలకే అవకాశమిచ్చింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని వారికి కూడా టిక్కెట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కలసి వచ్చిందనే చెప్పాలి. అలా ఆరు గ్యారంటీలతో పాటు ఐదు కారణాలు కాంగ్రెస్ విజయానికి కారణాలుగా చూడాలి.
Next Story