Tue Nov 05 2024 07:47:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : కార్తీక మాసం.. వనభోజనం.. కుల సమావేశం.. ఏర్పాట్లు షురూ
తెలంగాణ ఎన్నికల వేళ కార్తీక మాసం వచ్చేసింది. ఇక చూడండి.. కుల సమావేశాలకు నేతలు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ఎన్నికల వేళ కార్తీక మాసం వచ్చేసింది. ఇక చూడండి.. కుల సమావేశాలకు నేతలు సిద్ధమవుతున్నారు. కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్లడం సంప్రదాయంగా వస్తుంది. సాధారణంగా స్నేహితులు, బంధువులు కలసి వనభోజనాలకు వెళ్లి వస్తుంటారు. కార్తీక మాసంలో అందరూ కలుసుకుని తమ కుటుంబ సమస్యలను చెప్పుకోవడానికి వీటిని వేదికలుగా ఉపయోగించుకుంటారు. ఎక్కువ మంది ఈ వనభోజనాలతో ఆత్మీయ కలయికలుగా వాడుకుంటారు. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధిలో ఈ వన భోజనాల ఏర్పాట్లకు రెడీ చేసుకుంటున్నారు.
ఎన్నికలు రావడంతో...
కానీ ఈసారి కార్తీక మాసంలో తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు పార్టీల అభ్యర్థులు వన సమారాధన పేరిట ఇప్పటికే కొన్ని ఫామ్ హౌస్లను బుక్ చేసుకుంటున్నాయి. అక్కడ కులాల వారీగా సమావేశాలు పెట్టి తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. అభ్యర్థుల వ్యయం కూడా ఇందులోకి రాదు. సామూహిక సమావేశాలు కావడం, సంప్రదాయం కావడంతో ఎన్నికల లెక్కల నుంచి తప్పించుకోవచ్చు. మంచి భోజనంతో పాటు అన్ని రకాల వస్తువులు బహుమతులుగా ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
రిసార్ట్లను ముందుగానే...
నగర శివార్లలో ఉన్న రిసార్ట్స్ ను కొందరు రాజకీయ నేతలు ముందుగానే బుక్ చేసుకున్నట్లు సమాచారం. వారి పేరు మీద కాకుండా తమ ముఖ్య అనుచరుల పేర్లపై ఈ రిసార్ట్లన బుక్ చేసుకున్నారు. వచ్చిన వారందరికీ నాన్ వెజ్, వెజ్ తో రుచికరమైన భోజనాలు అందించేందుకు క్యాటరింగ్ వారిని కూడా అడ్వాన్స్ లు ఇచ్చి మరీ బుక్ చేసుకుంటున్నారు. సామాజికవర్గం ఓట్లను తమకు అనుకూలంగా రాబట్టు కోవడం కోసం అభ్యర్థులు ఈ ప్రయత్నాలు జోరుగా ప్రారంభించారు.
ఎన్నికల వ్యయం నుంచి...
కుల సమావేశాలు, కార్తీక వన భోజనాలపై కెమెరాల కన్ను ఉండదు. గుట్టు చప్పుడు కాకుండా ఖర్చు తమ నెత్తిన పడకుండా చేసే వీలుంది. పైగా అందరూ ఒకచోట చేరితే తాము తిరగకుండా ప్రచారం చేసుకునే వీలుంటుంది. కేవలం సామాజికవర్గాల వారీగా మాత్రమే కాకుండా కాలనీల వారీగా కూడా ఈ వనభోజనాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక మాసం రావడంతో ఈ ఎన్నికలు అభ్యర్థులకు ప్లస్ గా మారాయి. ఎక్కువ మంది నాన్ వెజ్ తినకపోవడం కూడా తమకు కలసి వస్తుందని అంటున్నారు. మొత్తం మీద అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా తమ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. వచ్చే ఆదివారం కార్తీక వనభోజనాల పేరిట పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Next Story