Sun Jan 12 2025 23:58:59 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీలది వృధాప్రయాస.. అలా చేస్తే ఫలితం కనిపించక పోవచ్చు
సెటిలర్లు అంటే కమ్మ సామాజికవర్గంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాంటి ధోరణినే తెలంగాణ నేతలు వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉన్నవాళ్ల ఆంధ్రోళ్లంతా కమ్మోళ్లేనా.. ఏమో డౌటు కొడుతుంది. రాజకీయ పార్టీలకు అలాగే అనిపిస్తుంది. సెటిలర్లు అంటే కమ్మ సామాజికవర్గంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. హైదరాబాద్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మాత్రమే కాదు.. ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారికి అండగా నిలిచింది. ఉపాధి అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటు కోసం దశాబ్దాల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పొలాలు కొని వ్యవసాయం చేసే వారు కొందరైతే. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు.
సెటిలర్లలో...
ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ రాలేదు. అన్ని కులాల వారు వచ్చారు. కోస్తాంధ్ర నుంచి కమ్మ, రాయలసీమ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటు కోసం ఒకింత ఎక్కువ సంఖ్యలో వచ్చినా అంతకంటే అధిక సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలు కూడా వచ్చాయి. అంటే హైదరాబాద్ సెటిలర్లు అంటే ఏ ఒక్క సామాజికవర్గమో అని చూడాల్సిన పనిలేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం కేవలం కమ్మ సామాజికవర్గం అత్యధికంగా సెటిలర్లుగా ఉన్నట్లు చూడటం ఎప్పటి నుంచో వస్తుంది. రాజకీయంగా వారు ఇక్కడ ఎదగడం వల్లనే ఈరకమైన ప్రచారం జరుగుతూ వస్తుంది.
ఒక వర్గానికే...
ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను కూడా ఖండించడం కూడా అందుకే. అన్ని పార్టీలూ ఆయన అరెస్ట్‌ను ఖండించం వెనక ప్రత్యేకంగా ఆయనపై ఉన్న ప్రేమ కాదు. అభిమానం అసలే కాదు. ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు పొందడానికే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఈ నేతలే చంద్రబాబును విమర్శించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అది కేటీఆర్ కావచ్చు. రేవంత్ రెడ్డి కావచ్చు. ఎవరైనా తమకు రాజకీయంగా లబ్ది జరుగుతుంది అంటే ఒకలా.. లేకుంటే మరొకలా ఇలా స్పందించడం రివాజుగా మారిపోయింది. కానీ సెటిలర్లందరూ ఒక పార్టీకి పరిమితమయిన వారు కాదు. ఏపీలో ఉన్నట్లే ఇక్కడ కూడా సెటిలర్లు అనేక పార్టీలుగా విడిపోయి ఉంటారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఇది నిజమయింది.
ఇక్కడా అంతే...
ఏపీలో రాజకీయాలను బట్టి ఇక్కడ కూడా ఏ పార్టీకి ఓటు వేయాలో? వద్దో? అన్నది కూడా సెటిలర్లు నిర్ణయించుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తేనో, సమర్థిస్తేనో ఓట్లు గంపగుత్తగా వచ్చి పడవు. పాపం.. బీజేపీ కూడా అదే తప్పులో కాలేసినట్లుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లోకేష్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లడానికి కూడా ఇదే కారణంగా చెబుతున్నారు. సెటిలర్లలో చంద్రబాబుకు అనుకూల ఓట్లు ఎన్ని ఉన్నాయో..వ్యతిరేక ఓట్లు కూడా అన్నే ఉన్నాయి. అందుకే సెటిలర్ల కోసం రాజకీయ పార్టీలు వేస్తున్న పిల్లిమొగ్గలు మాత్రం ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎలాంటి ఫలితాలు చూపబోవన్నది యదార్థం. సెటిలర్లంటే కేవలం కమ్మ సామాజికవర్గమే కాదన్నది రాజకీయ పార్టీలు గుర్తుంచుకుంటే మేలన్న విశ్లేషణలు బలంగా వినపడుతున్నాయి.
Next Story