Mon Dec 23 2024 14:52:12 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : వీళ్లు రారయ్యా సామీ... కానీ ఇక్కడే డెవలెప్మెంట్ అంతా.. ఎందుకలా?
హైదరాబాద్ లో అందరూ అనుకున్నట్లుగానే పోలింగ్ శాతం తగ్గింది
హైదరాబాద్ లో అందరూ అనుకున్నట్లుగానే పోలింగ్ శాతం తగ్గింది. జిల్లాలతో పోలిస్తే అతి తక్కువగా హైదరాబాద్ నగరంలోనే పోలింగ్ శాతం నమోదయింది. ఎప్పుడూ ఇంతే. సెలవు దొరికితే చాలు. ముసుగు తన్ని పడుకోవడమో. లేక ఎంజాయ్ చేయడానికి ఊళ్లకు చెక్కేయడమో తప్పించి ఓటు వేద్దామన్న స్పృహ ఎవరికీ ఉండదు. గత కొన్ని ఎన్నికల నుంచి ఇలాగే జరుగుతుంది. అతి తక్కువగా పోలింగ్ నమోదు కావడం పట్ల ఎన్నికల అధికారులు కూడా పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా ఎన్నికలకు యువత దూరంగా ఉండటం భవిష్యత్ లో ప్రమాదానికి సంకేతాలని విశ్లేషకులు సయితం చెబుతున్నారు.
నిధులన్నీ ఇక్కడే...
జిల్లాల కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడే నిధులను కుమ్మరిస్తారు. ఏ ప్రభుత్వమున్నా సరే ఇక్కడే అంతా. పల్లెల్లో సరైన రహదారులు కూడా ఉండవు. కానీ ఓటేయని వారికి మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించాలి. రోజూ మంచినీటి సరఫరా. అద్దాల్లాంటి రోడ్లు. మెట్రో రైళ్లు. ఒకటేమిటి. వీరికి ఉన్న ఫెసలటీస్ ఎవరికీ ఉండవు. అన్ని అనుభవిస్తూ ఓటు హక్కును ఒక గంట పాటు క్యూ లైన్ లో వేచి ఉండి వినియోగించుకోవడానికి మాత్రం తీరిక ఉండదు. నిర్లక్ష్యం అనుకోవాలా? నిరాసక్తత అని భావించాలా? అని చెప్పలేం కానీ ప్రతి ఎన్నికకూ ఇదే తంతు. అయినా హైదరాబాద్కు మాత్రం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయాలి.
గ్రామాల్లో...
చదువుకోకపోయినా.. గ్రామాల్లో ఉన్నా తమ పనులను వదులుకుని మరీ పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ అన్ని చోట్ల 60 శాతం పోలింగ్ జరిగితే హైదరాబాద్ లో మాత్రం 31 శాతం మాత్రం దాటలేదు. ఇకపై ఓటు కంపల్సరీ చేయాలి. ఓటు వేయకుంటే పథకాలు నిలిపేస్తామని ప్రభుత్వాలు హెచ్చరించాలని కొందరు సూచిస్తున్నారు. లేకుంటే వీళ్లు మాట వినరని, ఎప్పుడూ ఇలాగే ఉంటుందని సీనియర్ సిటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారంటే హైదరాబాదీలకు ఎంత బద్ధకమో ఇట్టే చెప్పవచ్చు. ప్రధానంగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న టెకీలు ఎక్కువగా పోలింగ్ కు రాలేదని చెబుతున్నారు. ఇలాగయితే హైదరాబాద్ లో ఎందుకు నిధులు వెచ్చించాలి? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
Next Story