Mon Dec 16 2024 06:38:17 GMT+0000 (Coordinated Universal Time)
Barrelakka : బర్రెలక్క అని తీసిపారేయకండి... ఎవరి ఓట్లకు గండి కొట్టనున్నారో తెలుసా?
కొల్లాపూర్ నియోజకవర్గంలో శిరీష అలియాస్ బర్రెలక్క పోటీ పై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది
ఎన్నికలంటే ఇప్పుడు కేవలం పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే కాదు.. కడుపు మండిన వాళ్లు కూడా పోటీకి దిగి రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతున్నారు. వారు వీరు అన్నది తేడా లేదు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి ఎన్నికల్లో పోటీ చేయడమే మార్గమమని నమ్ముతున్నారు. తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాంటి వారే పోటీలో ఉన్నారు. వారిలో శిరీష అలియాస్ బర్రెలక్క ఒకరు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమెకు యువతతో పాటు నెటిజన్లు కూడా మద్దతు పలుకుతున్నారు.
బర్రెలక్కగా...
ఆమె డిగ్రీ చదివి బర్రెలు కాసుకుంటున్నానని చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండేళ్ల క్రితం చేసిన ఈ వీడియోతో ఆమె బర్రెలక్క గా పేరు తెచ్చుకున్నారు. అసలు పేరు శిరీష అయినా బర్రెలక్కగానే ఫేమస్ అయ్యారు. ఎన్ని డిగ్రీలు ఉన్నా సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు రావడం లేదని ఆమె చేసిన వీడియోను అందరూ అభినందించారు. గత కొన్నాళ్లుగా ఆమె యూత్ లో తన వీడియోలతో ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు. నిరుద్యోగంపై సోషల్ మీడియా ద్వారా పోరాడుతున్న బర్రెలక్కకు అంతే స్థాయిలో మద్దతు కూడా లభిస్తుంది.
ఫాలోయిర్స్ గా....
యూట్యూబ్ లో ఆమెకు 1.49లక్షల మంది ఫాలోయిర్స్ ఉన్నారు. ఇన్స్టాలో ఐదు లక్షల మంది ఫాలోయిర్స్ ఉన్నారంటే ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నారో... ఎంతమంది ఆమె చేసిన వీడియోలను ఫాలో అవుతున్నారో ఇట్టే చెప్పవచ్చు. తాజాగా ఆమె కొల్లాపూర్ నియోజకర్గం నుంచి పోటీ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని, ప్రచారం కూడా చేయలేకపోతున్నానని చెప్పడంతో మల్లాడి కృష్ణారావు లాంటి వాళ్లు విరాళం రూపంలో కొంత మొత్తాన్ని ఇచ్చి ఆమెను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు.
సోషల్ మీడియాలో....
శిరీష, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన వారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శిరీష అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్థన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావులను ఢీకొనబోతున్నారు. వారిని ఎదుర్కొనడం అంత ఆషామాషీ కాదని తెలిసీ ఆమె నిరుద్యోగుల వాణి వినిపించేందుకు సిద్దమయ్యారు. చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు చేస్తున్న శిరీషకు చాలా మంది అండగా నిలబడ్డారు. తమ మద్దతు ఆమెకేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పడుతున్నారు. అలాగే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె సోదరుడిపై దాడి చేయడాన్ని కూడా పలువురు ఖండించారు. గెలుపోటముల పరిస్థిితి అలా ఉంచితే ఆమె అధికార, ప్రతిపక్ష పార్టీలను ధైర్యంగా ఎదుర్కొంటున్న తీరును అభినందించాల్సిందే.
మ్యానిఫేస్టో విడుదల...
బర్రెలక్కగా పేరు తెచ్చుకున్న శిరీష ఎన్నికల సందర్భంగా తన మ్యానిఫేస్టోను కూడా విడుదల చేసింది. తాను కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని తెలిపారు. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా చూస్తానని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తానని, ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించే విధంగా పనిచేస్తానని తెలిపారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తానని మ్యానిఫేస్టోలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణను ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని మ్యానిఫేస్టోలో తెలిపారు.
Next Story