Thu Nov 14 2024 05:17:00 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : హామీలు గట్టెక్కిస్తాయా? పథకాలు పనిచేస్తాయా?
తెలంగాణ శానససభ ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదు. గట్టిగా పక్షం రోజులు మాత్రమే సమయం ఉంది.
తెలంగాణ శానససభ ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదు. గట్టిగా పక్షం రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు జనాలను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యానిఫేస్టోను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, బీఆర్ఎస్ తన మ్యానిఫేస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ రేపు మ్యానిఫేస్టోను విడుదల చేయనుంది. బీజేపీ కూడా కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఆ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు.
కాంగ్రెస్ హామీలతో...
ఇలా జనంలోకి వెళ్లేందుకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఉచిత హామీలు.. గ్యారంటీలు... అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు నిరుద్యోగులకు భృతి, ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రైతులకు పెట్టుబడి సాయంతో పాటు కౌలు రైతులకు కూడా అందచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రధానంగా మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళుతుంది.
బీఆర్ఎస్ పథకాలతో...
ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పింఛనును రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకూ పెంచుకుంటూ వెళతామని పేర్కొంది. రైతు బంధు సాయాన్ని కూడా పెంచుతామిన తెలిపింది. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామని తెలిపింది. దీంతో పాటు తెల్ల రేషన్ కార్డులున్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపింది. తెల్ల రేషన్ కార్డు దారులకు గ్యాస్ సిలిండర్ ను నాలుగు వందలకే ఇస్తామని చెప్పింది. ఇంకా ఎన్నో వరాలు ప్రకటించింది. గత పదేళ్లుగా తమ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రకటించి మరోసారి గెలిపించాలని కోరుతుంది.
బీజేపీ కూడా అదే బాటలో...
భారతీయ జనతా పార్టీ కూడా మ్యానిఫేస్టోలో ప్రజలను ఆకట్టుకునేలా రూపొందించినట్లు తెలిసింది. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తామని వెల్లడించింది. మాదిగ రిజర్వేషన్లకు ఎ:డ్ కార్డు వేస్తామని చెప్పింది. దీంతో పాటు మరికొన్ని రాయితీలను కూడా ప్రకటించేందుకు కమలం పార్టీ సిద్ధమవుతుంది. బీజేపీ పూర్తిస్థాయి మేనిఫేస్టో బయటకు వస్తే కాని తెలియదు కానీ, బయట ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనూ బీజేపీ ఉచిత హామీలను ప్రకటించింది. ఇక్కడ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తుందని అంటున్నారు. మరి ప్రజలు ఈ హామీలను నమ్మి ఎవరికి ఓటేస్తారన్నది అర్థం కాకుండా ఉంది. అలాగే మార్పును కోరుకోవద్దని, బోరు కొట్టిందని బోల్తా పడవద్దని బీఆర్ఎస్ చెబుతుండగా, అహంకారం పోవాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ హస్తం పార్టీ ముందుకు వెళుతుంది. బీజేపీ కూడా తామే అధికారంలోకి వస్తామని చెబుతుంది. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story