Fri Dec 20 2024 01:42:26 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కేసీఆర్ ఫాం హౌస్కు వెళ్లడం ఖాయం...మ్యానిఫేస్టో విడుదల కార్యక్రమంలో ఖర్గే
తెలంగాణ ఎన్నికల మ్యానిఫేస్టో విడుదలయింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మ్యానిఫేస్టోను విడుదల చేశారు
తెలంగాణ ఎన్నికల మ్యానిఫేస్టో విడుదలయింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. మొత్తం 42 పేజీలతో ఈ మ్యానిఫేస్టో ను విడుదల చేశారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫేస్టోను మల్లికార్జున ఖర్గే జనం ముందుంచారు. మొత్తం 62 అంశాలతో మ్యానిఫేస్టోను విడుదల చేశారు. గాంధీ భవన్ లో ఈ మ్యానిఫేస్టోను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. అందరినీ సంప్రదించే మేధావుల సలహాలు, సూచనలు తీసుకుని ఈ మ్యానిఫేస్టో ను రూపొందించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అరవై సంవత్సరాల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యానిఫేస్టోను రూపొందించామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను తొమ్మిదేళ్లుగా కాలరాసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించాడన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన అన్నింటినీ ఇందులో పొందుపర్చామని తెలిపారు.
ప్రభుత్వ సంపదను...
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీపుల్స్ మ్యానిఫేస్టోను విడుదల చేయడం జరిగిందన్నారు. ఏ ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో దానిని నెరవేర్చుకునే దిశగా ఈ మ్యానిఫేస్టోనూ రూపొందించడం జరిగిందన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం సంపదను దోచుకుందన్నారు. తెలంగాణ సంపదను పంచే విధంగానే ఈ మ్యానిఫేస్టోను రూపకల్పన చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా ఈ ఎన్నికల ప్రణాళికను రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. ఇందులో ఉన్న అన్ని అంశాలను ఇంటింటికి తిరిగి ఆరు గ్యారంటీలతో పాటు మ్యానిఫేస్టోను కూడా తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని మల్లు భట్టి విక్రమార్క కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన తెలిపారు.
అధికారంలోకి రాగానే...
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మ్యానిఫేస్టో చెప్పిన హామీలను అమలుపరుస్తామని తెలిపారు. ఈసారి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇది ప్రజల అభిప్రాయం అన్నారు. ప్రజల మూడ్ ఈసారి అలాగే ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం వంటి కారణాలతో కేసీఆర్ మరింత అప్రదిష్టను మూటగట్టుకున్నారన్నారు. కేసీఆర్, మోదీ కలసి పనిచేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని ఆపలేరన్నారు. కేసీఆర్ రిటైర్మెంట్ కాక తప్పదని, ఫాంహౌస్ కు వెళ్లకతప్పదన్నారు. కేసీఆర్ అనుకున్నట్లుగానే ప్రజలు కూడా ఫాం హౌస్ కు సాగనంపడానికే నిర్ణయించుకున్నారన్నారు.
Next Story