Thu Dec 19 2024 07:01:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections Counting : వాళ్లు ఒకలా.. వీళ్లు మరోలా.. ఎందుకలా?
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపు కౌంటింగ్ జరగనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగానే వచ్చాయి
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపు కౌంటింగ్ జరగనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగానే వచ్చాయి. ఏవో రెండు మూడు తప్పించి దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు హస్తం పార్టీదే అధికారమని తేల్చాయి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే... అధికార పార్టీ గుంభనంగా ఉంది. కేటీఆర్ తప్ప ఎవరూ మీడియా ముందుకు రాలేదు. ఆరోజు ఇంకా పోలింగ్ జరుగుతున్న సమయంలోనే మీడియా సమావేశం పెట్టి పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎలా ఎగ్జిట్ పోల్స్ కు అవకాశమిస్తారని కేంద్ర ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. తాము 70 స్థానాలతో అధికారంలోకి వస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు. మరుసటి రోజు మాత్రం తాను హ్యాపీగా నిద్రపోయానని, 3వ తేదీన శుభవార్త వింటున్నామని తెలిపారు.
కేబినెట్ భేటీ అంటూ...
మరోవైపు నాలుగో తేదీన కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరు మంత్రులు గెలుస్తారో? లేదో? నమ్మకం లేనప్పుడు కేబినెట్ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే తామే అధికారంలోకి వస్తామన్న పూర్తి విశ్వాసంతో కేసీఆర్ మంత్రి వర్గ సమావేశం తేదీని ముందుగానే ప్రకటించారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాదు.. కాదు.. కౌంటింగ్ సమయంలో క్యాడర్ నిరుత్సాహపడకుండా ఉండేందేకే ఈ మంత్రి వర్గ సమావేశాన్ని ముందుకు తెచ్చారని విపక్షాలు అంటున్నాయి. పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే కేబినెట్ సమావేశం ఎలా పెడతారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
ప్రమాణ స్వీకారం డిసెంబరు 9న...
కానీ జనవరి పదహారో తేదీ వరకూ కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని అధికార పార్టీ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఫుల్లు కాన్ఫిడెన్స్ తో ఉంది. తాము అధికారంలోకి వచ్చినట్లే భావిస్తుంది. అన్ని ఏజెన్సీలు అనుకూలంగా సర్వేలు చెప్పడంతో పాటు వస్తున్న ఫీడ్ బ్యాక్ కూడా తమదే విజయమని చెబుతుండటంతో విజయోత్సవాలు మినహా దాదాపుగా ప్రభుత్వంలోకి వచ్చినట్లే భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల బలగాలను పెంచడం కూడా ఇందుకు నిదర్శనమని అంటున్నారు. రేవంత్ రెడ్డి నుంచి కింది స్థాయి నేత వరకూ మీడియా ముందుకు వచ్చి తమదే అధికారమని పదే పదే ప్రకటిస్తున్నారు. నియంత పాలనకు కాలం చెల్లిందని ప్రకటనలు చేస్తున్నారు. డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా డేట్ ఫిక్స్ చేశారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు...
ఇలా కేబినెట్ డేట్ ఫిక్స్ కావడం..... అటు కాంగ్రెస్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఫిక్స్ కావడంతో ఏమీ అర్ధం కానిది ప్రజలకే. ఎగ్జిట్ పోల్స్ ను తప్పుగా అంచనా వేయలేం. అలాగని ఖచ్చితత్వాన్ని కూడా కాదనలేం. ప్రజల మూడ్ ను బట్టి అవి అంచనాలు వేసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇస్తాయి. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పవచ్చు. ఒక్కోసారి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ లో ప్రతి నేత ఉత్సాహంతో కనిపిస్తుండగా, బీఆర్ఎస్ నేతల్లో మాత్రం పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదన్నది మాట వాస్తవం. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60. ఆ ఫిగర్ దాటేంత వరకూ అందరికీ టెన్షన్ తప్పదు. కానీ కాంగ్రెస్ ఒకలా.. బీఆర్ఎస్ మరొలా..ఎందుకలా?
Next Story