Thu Dec 19 2024 06:49:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : 30 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్.. అధికారాన్ని ఇచ్చేది అవేనట
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ప్రజల తీర్పు వెలువడటానికి 48 గంటల సమయం ఉంది
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ప్రజల తీర్పు వెలువడటానికి 48 గంటల సమయం ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని తేల్చాయి. జాతీయ న్యూస్ ఏజెన్సీలతో పాటు స్థానిక ఏజెన్సీల సర్వేల్లో కూడా కాంగ్రెస్ కే కొంత అనుకూలంగా ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ గెలిచినా 60 నుంచి 65 స్థానాలతోనే ఉంటుందని చెప్పాయి. బీఆర్ఎస్ కూడా గణనీయమైన స్థానాలు దక్కించుకునే అవకాశాలు కనిపించేలా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ఉన్నాయి. అయితే ముప్ఫయి నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉందని ప్రతి ఏజెన్సీ చెబుతుంది. ఆ నియోజకవర్గాలే అధికారం ఎవరిదీ అన్నది నిర్ణయిస్తాయని తేల్చి చెబుతున్నాయి.
ముఖాముఖి పోటీతో...
తెలంగాణలో జరిగిన 119 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉందని తేలింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, మరికొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పోటీ నెలకొని ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది అన్న దానిపై ఇప్పటికే బెట్టింగ్లు ఊపందుకున్నాయి. తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటే తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారన్న ధీమాతో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. అయితే ఎవరు గెలిచినా రెండు వేల నుంచి వెయ్యి ఓట్లలోపే మెజారిటీ ఉండవచ్చన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. ఈ ముప్ఫయి నియోజకవర్గాల్లో ఎవరిది గెలుపు అన్న దానిపై పార్టీ అధినేతలు అక్కడి నేతలకు ఫోన్ చేసి మరీ సమాచారం తెప్పించుకుంటున్నారు.
తక్కువ మెజారిటీతో...
కరీంనగర్, ముథోల్, సిర్పూర్ కాగజ్ నగర్, కోరుట్ల, హుజూరాబాద్, మహేశ్వరం, ఎల్.బి.నగర్తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కీ ఫైట్ ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచినా వెయ్యి నుంచి పదిహేను వందల ఓట్ల లోపే మెజారిటీ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ముప్ఫయి నియోజకవర్గాల్లో ఎవరిది పై చేయి అయితే వారిదే అధికారం అవుతుందన్న టాక్ కూడా పొలిటికల్ వర్గాలను షేక్ చేస్తుంది. బీజేపీ బలంగా ఉన్న చోట ఎవరికి ఇబ్బంది కలిగింది? ఆ ఓటు బ్యాంకు వల్ల ఎవరికి నష్టం కలిగిందన్న అంచానాలతో రాజకీయ పార్టీల నేతలు లెక్కలు తెప్పించుకుని మరీ ధైర్యం తెచ్చుకుంటున్నారు.
ఓట్ల చీలికతో...
కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థుల కారణంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు చిల్లుపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కు డ్యామేజీ జరిగిందని కూడా చెబుతున్నారు. బీజేపీ మాత్రం తాము ఈ ఎన్నికల ఫలితం తర్వాత కీలకంగా మారబోతున్నామని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లే భావిస్తుంది. బీఆర్ఎస్ సయితం తమకు 70 నియోజకవర్గాల్లో మెజారిటీ లభించడం ఖాయమని నొక్కి మరీ చెబుతుంది. రెండు పార్టీల్లో కాన్ఫిడెన్స్ ఉండటానికి కారణం ఆ ముప్ఫయి నియోజకవర్గాల్లో గెలుపోటములు సర్వే సంస్థలకు కూడా అందకపోవడమే. ఎవరికి వారే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. మరి డిసెంబరు 3వ తేదీకి మాత్రమే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story