Mon Dec 23 2024 08:14:38 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : దాదాపు రెండు దశాబ్దాలు.. అధికారంలో లేకుంటే అంతేగా.. పార్టీ పదవికి కాసాని రాజీనామా
తెలంగాణ టీడీపీకి అధ్యక్ష పదవి అచ్చి రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముగ్గురు అధ్యక్షులుగా పనిచేశారు
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష పదవి అచ్చి రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముగ్గురు అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో ఎవరూ కుదురుగా ఉండలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీకి తెలంగాణ అధ్యక్ష పదవి కలసి రావడం లేదన్న సెంటిమెంట్ బయలుదేరింది. ఒక అధ్యక్షుడు పదవి కోసం పార్టీని వీడితే, మరొక అధ్యక్షుడిని పార్టీ అధినాయకత్వమే తొలగించింది. మూడో అధ్యక్షుడు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండటంతో సైకిల్ పార్టీకి ఈ సెంటిమెంట్ పై ఆందోళన పట్టుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా రేపో, మాపో పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
చివరిసారిగా అప్పుడే...
ఉమ్మడి రాస్ట్రంలో 1999 లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంటే 2004 వరకూ తెలంగాణలో టీడీపీ అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు హోల్ అండ్ సోల్ కావడంతో పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ 2014 నుంచి ఆ పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఉన్న నేతలందరూ పార్టీని వీడి వెళ్లారు. మిగిలిన నేతలు మాత్రం ఎటూ వెళ్లలేక పార్టీ పదవులను చూసి అంటిపెట్టుకుని ఉన్నారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎల్. రమణను పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన చాలా కాలం అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఏపీలో అప్పుడు అధికారంలో ఉండటంతో ఇక్కడ నిధులు ఇచ్చేందుకు కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు.
ఎల్ రమణ బీఆర్ఎస్ లోకి...
అదే 2019 ఎన్నికలకు ముందు నుంచే ఇక్కడ సమస్యలు మొదలయ్యాయి. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎల్. రమణ పార్టీని వీడారు. ఆయనకు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇవ్వడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులును చంద్రబాబు టీటీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నరసింహులు 2014లో నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021లో టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. తర్వాత పార్టీని ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆయనను తొలగించి కాసాని జ్ఞానేశ్వర్ ను చంద్రబాబు అధ్యక్షులుగా నియమించారు.
కస్సుమంటున్న కాసాని...
ఏడాది కాలంలోనే బక్కని నరసింహులును తొలగించి కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించడంతో ఆయన పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ఆయన సగర్వంగా ప్రకటించుకున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తెచ్చారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చింది. అభ్యర్థులందరినీ సిద్ధం చేసిన తర్వాత ఇదేమి నిర్ణయమంటూ కాసాని కస్సుమంటున్నారు. ఆయన పార్టీకి రాజీనాామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీతో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లోకేష్ కు ఇరవై సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని, కార్యకర్లలకు అన్యాయం చేసే పార్టీలో ఉండదలచుకోలేదని ఆయన చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పార్టీకే కాదు అధ్యక్ష పదవి కూడా అచ్చి రాలేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Next Story