Mon Dec 23 2024 15:00:12 GMT+0000 (Coordinated Universal Time)
Azharuddin : అప్పుడప్పుడు కనిపించి వెళ్లే అజారుద్దీన్ కి టిక్కెట్టా? అసలు రీజన్ అదేనా?
కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టిక్కెట్ ఇవ్వడం వెనక అనేక కారణాలున్నాయి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన ఎంపికపై కొంత ఇష్టం కొంత అయిష్టంగానే కనపడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను బట్టి అభ్యర్థిని ఎంపిక చేసినట్లు కనపడుతుంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఎంపిక మామూలుగా జరగలేదు. అనేక విశ్లేషణలు, సమీకరణాలు, ఆలోచనలు చేసిన తర్వాతనే అజారుద్దీన్ పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. అజారుద్దీన్ కు టిక్కెట్ కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత అయిష్టత ఉంది. అక్కడ ఉన్న పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డికి కాకుండా అజారుద్దీన్ కు టిక్కెట్ ఇవ్వడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విష్ణు పార్టీకి దూరంగా...
విష్ణువర్థన్ రెడ్డిని చూసుకుంటే... కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేదా? అన్న అనుమానం కూడా ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమానికి ఆయన హాజరయింది లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను కూడా చేపట్టడం లేదు. తండ్రి పీజేఆర్ కు ఉన్న పేరు మీదనే ఆయన ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు రారు. పెద్దమ్మగుడి వ్యవహారాలు తప్ప పార్టీని ఏమాత్రం పట్టించుకోని విష్ణు వర్ధన్ రెడ్డికి ఎందుకు టిక్కెట్ ఇవ్వాలని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ కోసం విష్ణువర్ధన్ రెడ్డి పడిన శ్రమ ఏంటో చెప్పాలంటూ కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అజార్ కూడా అంతే అయినా...
ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ టిక్కెట్ కేటాయించిన అజారుద్దీన్ కూడా ఇంచుమించుగా అంతే. పార్టీ కష్ట సమయంలోనూ పత్తా ఉండరు. విష్ణువర్థన్ రెడ్డికి ఏమాత్రం తీసిపోరు. అజారుద్దీన్ పైగా లోకల్ లో ఉండరు. హైదరాబాద్ సొంతూరయినా ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటారు. విష్ణు ఇక్కడే నివాసముంటారు. కొద్దిలో కొద్దిగా నయం. అజారుద్దీన్ పార్టీ బలోపేతానికి చేసిన కృషి జీరో అనే చెప్పాలి. అజర్ భాయ్ పార్టీలో ఉన్నారన్న సంగతి గాంధీభవన్ లోనే ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు కనిపించి అలా వెళ్లిపోతారు. మరి ఆయనకు ఎందుకు టిక్కెట్ ఇచ్చారన్న సందేహం కూడా క్యాడర్ లో కలుగుతుంది. విష్ణువర్థన్ రెడ్డి, అజారుద్దీన్ లలో పోల్చుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజార్ కొంత బలంగా కనిపిస్తున్నాడన్నది పార్టీ హైకమాండ్ వాదన.
సామాజికవర్గం ఓట్ల కోసమే...
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఓట్ల కోసమే అజారుద్దీన్ ఎంపిక జరిగిందని చెబుతున్నారు. పైగా రాష్ట్రమంతటా ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి కూడా అజారుద్దీన్ ఉపయోగపడతారని హైకమాండ్ అంచనా వేసింది. అందుకే అజారుద్దీన్ ను జూబ్లీహిల్స్ బరిలోకి దింపింది. ఇక్కడ మైనారిటీ వర్గాలే కాకుండా ఉన్నతస్థాయి వర్గాల ప్రజలు కూడా అధికంగానే ఉండటం, వారితో అజారుద్దీన్ కు ఉన్న పరిచయాలు కూడా పార్టీ విజయానికి దోహదపడతాయని భావించి చివరి నిమిషంలో టిక్కెట్ కేటాయించింది. పీజేఆర్ కుటుంబానికి అన్యాయం చేయకుండా ఆమె కుమార్తె విజయారెడ్డికి ఖైరతాబాద్ టిక్కెట్ కేటాయించింది. అందుకే అజార్ భాయ్ ను రంగంలోకి దించింది. దీంతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాధ్ వరసగా రెండు సార్లు గెలవడం వల్ల కూడా ఆయనపై ఉన్న అసంతృప్తి అజార్ వైపు మరలుతుందన్న అంచనాలో ఉన్నారు. జూబ్లీహిల్స్ లో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలతో పాటు మిగిలిన కులాల వారు కూడా అధికంగా ఉండటంతో కాంగ్రెస్ కు అనుకూలం అవుతుందన్నది విశ్వేషకుల అంచనా.
Next Story